తెలుగు పేర్లు పెట్టేలా చట్టం తీసుకొస్తాం : తమ్మారెడ్డి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేలా ప్రభుత్వంతో మాట్లాడి చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇటీవల మహాసహల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. హైదరాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో ఏర్పాటు చేసిన ‘ మీట్‌ ది ప్రెస్‌ ‘  కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమంలో సమస్యలు వివాదాలపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. చలన చిత్ర నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఓ టీవీ చానెల్‌ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నమాట అవాసవమని అన్నారు. సామాజిక ప్రయోజనాల కోసం సినిమాలు రూపొందించాలి తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం సినిమాలు తీయరాదని సాటి నిర్మాతలకు హితవు పలికారు. త్వరలోనే తానొక సామాజిక చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.