దళారులను నమ్మి మోసపోవద్దు — ఎంపీడీఓ చంద్రశేఖర్

 

 

 

 

 

కారేపల్లి, మార్చి 9, జనం సాక్షి) ;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితుల అభివృద్ధి కోసం చేపట్టిన రెండవ విడత దళిత బంధు పథకంపై దళారులను నమ్మి మోసపోవద్దు సింగరేణి మండలం ఎంపీడీవో ఎం చంద్రశేఖర్ అన్నారు. గురువారం కారేపల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ దళిత బంధుపై రకరకాల కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రెండో విడత దళిత బంధు పథకం పై ఉన్న అపోహలను తొలగించేందుకు మండల ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారన్నారు. రెండో విడత దళిత బంధు ఇస్తామంటూ గ్రామాల్లో కొందరు దళారుల అవతారం ఎత్తి డబ్బులు దండుకుంటున్నట్టు వినిపిస్తున్నాయన్నారు. ఇటువంటి వాటిపట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలన్నారు. దళారుల నుంచి రక్షించేందుకు మండలంలోని గ్రామాలలో దళిత వాడలలో స్వయంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి వీటి యొక్క విధి విధానాలను వివరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకు దళిత బంధు పథకంపై అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశానన్నారు. తాను సైతం వ్యక్తిగతంగా లబ్ధిదారుల యూనిట్లను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.