దొడ్డి కొమురయ్య స్పూర్తిని నలువైపులా చాటి చెప్పాలి


– జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌
జనంసాక్షి, మంథని : తెలంగాణ సాయుధ పోరాటయోధుడు దొడ్డి కొమురయ్య అని, ఆయన స్పూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. తెలంగాణ తొలిదశ అమరవీరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్బంగా మంథని పట్టణంలోని రాజగృహాలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ.. తెలంగాణ తొలిదశ పోరాటం తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని ఆయన వివరించారు. ఆయన స్పూర్తిని నలువైపులా చాటి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మంథని నియోజకవర్గంలో గత పాలకులు మహనీయుల చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నాలు చేశారని, ఒక్కరి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వారి చరిత్రను చాటి చెప్పుకున్నారే తప్ప ఆనాడు మన కోసం, మన తరాల కోసం త్యాగాలు చేసిన మహనీయుల గురించి ఏనాడు చెప్పలేదని ఆయన అన్నారు. మహనీయుల చరిత్రను తెలుసుకోవడం అందరి బాధ్యత అని, ఈ క్రమంలో మహనీయుల చరిత్రను చాటి చెప్పాలన్న ఆలోచనతో మంథనిలో మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. ఇప్పటికే మంథని బొక్కలవాగుపై దొడ్డి కొమురయ్య విగ్రహ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని, త్వరలో విగ్రహాన్ని నెలకొల్పి ఆవిష్కరిస్తామని ఆయన తెలిపారు.