నేటి డిఎల్‌ పరీక్షకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌, జూన్‌ 8 : డిగ్రీ లెక్చరర్ల రాత పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎపిపిఎస్‌సి కార్యదర్శి పూనం మాలకొండయ్య శుక్రవారంనాడు ఒక ప్రకటనలో చెప్పారు. శనివారం కొత్త హాల్‌ టిక్కెట్లతోనే అభ్యర్థులు పరీక్షకు  హాజరు కావాలని సూచించారు. రేపు పరీక్ష హాలు వద్దకు గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ సహా అయిదు నగరాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్‌, తిరుపతిలలో పరీక్షలు జరగనున్నట్టు తెలిపారు. 656 ఉద్యోగాలకు గాను సుమారుగా 5వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మే 6న ప్రశ్నాపత్రాలు అందకపోవడంతో డిఎల్‌ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే.