పూరిలో కదిలిన జగన్నాథుని రథం

భువనేశ్వర్‌ :
జగాన్ని ఏలే జగన్నాధుని రధ యాత్ర గురువారంనాడు పూరీలో కన్నుల పండువగా ప్రారంభమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ యాత్రకు దేశం నలుమూలలనుంచే గాక విదేశాలనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనం దగ్గరికి జగన్నాధుడు తరలి వచ్చే ఈ అధ్భుత ఘట్టాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తులు పోటెత్తారు. జగన్నాధస్వామి సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి పూరి శ్రీమందిరం నుంచి గుండీచా ఆలయానికి బయల్దేరాడు. ఆషాడ మాసం రెండో రోజు పూరిలో రథయాత్ర నిర్వహించడం ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. ఆ దేవదేవుడికి స్వాగతం పలికేందుకు వరుణుడు కూడా తరలివచ్చాడా అన్నట్టు కురిసిన చిరుజల్లుల మధ్య వేల సంఖ్యలో తరలివచ్చిన భక్తులు రథం లాగుతుండగా జగన్నాధుడు భుక్తులను ఆశీర్వదిస్తూ ముందుకు కలదులుతున్న దృశ్యం మనోహరంగా కనబడింది. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కమనీయమైన రథయాత్ర చూసేందుకు పూరి తరలివచ్చారు.. పూరిలోనేగాక గుజరాత్‌. రూర్కేలా, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో కూడా పూరీ జగన్నాధ ఆలయాల ఆధ్వర్యంలో జగన్నాధ రధ యాత్రా వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్‌లో …. భువనేశ్వర్‌ :
హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌ లో గల పూరీ జగన్నాధ ఆలయంలో జరిగిన వేడుకల్లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వారు రధయాత్రను ప్రాంభించారు.కొద్ది సేపు స్వామి వారి రధయాత్రలో పాల్గొని రధాన్ని లాగుతూ స్వామివారి కృపను పొందామని సంతోషించారు. సుభద్రాదేవి, బలభద్రుడు, జగన్నాధ స్వామి విగ్రహాలను శోభాయమానంగా అలంకరించి రధాలపై ఊరేగించారు. అంతకు ముందు విగ్రహాలను రధాలపైకి చేర్చే పహాండి కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్‌ నరిసింహన్‌ మాట్లాడుతూ ప్రజలందరినీ చల్లగా చూడాలని. భోగ భాగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, సమాజంలో శాంతి సామరస్యాలు విలసిల్లేలా ఆశీర్వదించాలని దేవ దేవుడిని ప్రార్ధించానని చెప్పారు. మాజీ డిజిపి ఎ కె మహంతీ కూడా ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేలాదిగా భుక్తులు తరలి రావడంతో ఈ ప్రాంతమంతా జనసందోహంతో నిండిపోయింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేసారు.