పెగాసస్‌పై నిపుణుల కమిటీ


` సర్వోన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం
దిల్లీ,సెప్టెంబరు 23(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌తో ఫోన్ల హ్యాకింగ్‌ వ్యవహారంపై విచారణకు సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ గురువారం వెల్లడిరచారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఓ కేసు విచారణ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌ సింగ్‌తో చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ విషయాన్ని తెలిపారు. పెగాసస్‌పై దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ల తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదుల్లో చందర్‌ కూడా ఒకరు. నిజానికి ఈ కమిటీ ఏర్పాటుపై ఈ వారంలో ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంకోర్టు భావించింది. అయితే సాంకేతిక కమిటీలో సభ్యులుగా ఉండేందుకు కొందరు నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని చీఫ్‌ జస్టిస్‌ వెల్లడిరచారు. అతిత్వరలో సభ్యులను ఖరారు చేసి సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనిపై వచ్చేవారం ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. పెగాసస్‌ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సెప్టెంబరు 13న సుప్రీంకోర్టు విచారణ జరిపి.. మధ్యంతర ఉత్తర్వులను రిజర్వు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశిస్తే నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తాం తప్పితే, ఫోన్లపై నిఘా ఉంచడానికి పెగాసస్‌ కానీ, ఇతరత్రా ఏదైనా సాఫ్ట్‌వేర్‌ కానీ ఉపయోగిస్తోందా? లేదా? అని చెప్పే అఫిడవిట్‌ దాఖలుకు కేంద్రం మరోసారి విముఖత వ్యక్తం చేసింది. దీంతో కేంద్రం తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను చెప్పాలని తాము అడగట్లేదని.. చట్టప్రకారం అనుమతించే మార్గాల్లో కాకుండా, ఇతర మార్గాల్లో నిఘా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించారా? లేదా? అన్నది తెలుసుకోవాలనుకుంటున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.