పొరపొచ్చాలు సహజమే

హైదరాబాద్‌, జూలై 5: కుటుంబం అన్నాక బేధాభిప్రాయాలు సహజం. మాది టిడిపి కుటుంబం. చిన్న చిన్న పొరపొచ్చాలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని సరిదిద్దుకుంటాం.  ఇటువంటివన్నీ సహజమే అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ  నేత తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. గురువారంనాడు  ఉదయం ఆయన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన  అనంతరం విలేకరులతో మాట్లాడారు.  రానున్న సికింద్రాబాద్‌ మహంకాళీ జాతరకు పార్టీ అధ్యక్షుడిని ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు.    తన అసంతృప్తిని చంద్రబాబుకు వివరించానని తెలిపారు. ప్రతి పార్టీలోనూ ఒడిదుడుకులు సహజంగానే ఉంటాయని చెప్పారు. అలాగే తెలుగుదేశం పార్టీలోనూ ఉన్నాయన్నారు. చంద్రబాబుతో రాజకీయాల పైన కూడా చర్చించినట్లు చెప్పారు. తాను పార్టీ కార్యాలయానికి వెళతానో లేదో చెప్పలేనని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే పార్టీపైన అసంతృప్తి తగ్గినట్టుగా కనిపించడం లేదు. సుమారు గంటకు పైగా బాబుతో తలసాని చర్చలు జరిపారు. తన అసంతృప్తిని స్పష్టంగా  ఆయనకు వివరించానని యాదవ్‌ చెప్పారు.  బాబుతో భేటీ అయ్యాక కూడా తాను పార్టీ కార్యాలయానికి వెళతానో లేదో అని తలసాని వాఖ్యానించడం ఆయనకున్న  అసంతృప్తి తొలగలేదనడానికి నిదర్శనమని అంటున్నారు.దీనిపైవిలేకరులు ప్రశ్నించినా నర్మగర్భంగా జవాబిస్తూ వెళ్ళిపోయారు. కాగా తలసాని ఇటీవల  రాజ్యసభ ఎన్నికలప్పటి నుంచి పార్టీ పైన అసంతృప్తితో ఉన్నారు.  రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. తనకు ఇవ్వకపోవడమే కాకుండా పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌కు టిక్కెట్‌ ఇవ్వడం ఆయనకు తీవ్ర ఆగ్రహం కలిగించింది.