పోలవరం ఆలస్యానికి కేంద్రానిదే బాధ్యత


సకాలంలో నిధులు విడుదల చేయకుండా అడ్డంకులు
కొణతాల విమర్శ
విశాఖపట్టణం,మార్చి12(జ‌నంసాక్షి): ప్రస్తుత పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్‌  నిర్ణీత సమయానికి  పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని  ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్‌, మాజీమంత్రి కొణతాల రామకృష్ణ అన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటించినట్టుగా 2019నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేయగా, కేంద్ర ప్రభుత్వం రూ.5వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. ఇలా అయితే పోలవరం ఎప్పటికి పూర్తయ్యేనని అన్నారు. పోలవరం కోసం తక్షణం నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు.  రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందనివిమర్శించారు. విభజన చట్టంలో ఉన్న హావిూల అమలును కేంద్రం విస్మరించిందని ఆరోపించారు. ఇక్కడి బిజెపి నేతలు ప్రకటన చేసే బదులు పార్లమెంట్‌ వేదికగా ఇచ్చిన  హావిూలపై చర్చించాలని అన్నారు.  ప్రజల మనోభావాలను పట్టించుకోని బీజేపీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని  స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో బీజేపీ మ్యానిఫెస్టోలో పొందుపరచిన విధంగా ఏపీకి ప్రత్యేక¬దా కల్పించడంలో విఫలం అయిందని, ఇందుకుగాను ధర్మపోరాటం ప్రారంభించామని చెప్పారు. ఇదిలావుంటే జగన్‌ వ్యక్తిగత, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో వైసీపీ పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని  మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు  విమర్శించారు. ఆయన వక్రబుద్ధిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.  బీజేపీతో పొత్తు గురించి జగన్‌ బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, రాష్ట్రాభివృద్ధికి
నిరంతరం శ్రమిస్తున్న సీఎం చంద్రబాబును విమర్శించడం బాధాకరమని  అన్నారు.  మిత్రపక్షమైన బీజేపీలో ఉన్న పురందేశ్వరి కేంద్రం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడానికి కృషి చేయకుండా సీఎంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని  అన్నారు. రాష్ట్రానికి  అన్యాయం చేసిన బీజేపీతో కుమ్మక్కైన జగన్‌ కేసుల నుంచి బయటపడటానికి అవిశ్వాస తీర్మానం, రాజీనామాలంటూ డ్రామాలు అడుతున్నారని, ఆయనకు అభివృద్ధి, ప్రజల సంక్షేమం అనవసరమని, సీఎం కావడం ఒక్కటే జగన్‌ లక్ష్యమని ధ్వజమెత్తారు. అందుకే జగన్‌ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ఆ పార్టీవారు ఢిల్లీలో చెప్పేదొకటి, ఏపీలో చెప్పేదొకటి అన్నారు.

తాజావార్తలు