ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు

పాల్వంచ: ప్రభుత్వం ముందు చూపులోపమే విద్యుత్తు కోతలు, ప్రజల వెతలకు కారణమని తెఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ప్రధానంగా తెలంగాణలో 1991 తర్వాత తెలంగాణలో భూపాలపల్లి మినహా విద్యుత్తు ఉత్పాదన కేంద్రాలు నిర్మించలేదన్నారు. ఈ విషయంలో కూడా తెలంగాణ వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ పోరుయాత్ర ప్రారంభ కార్యక్రమానికి శనివారం ఖమ్మంజిల్లా పాల్వంచ వచ్చిన ఆయన తొలుత కేటీపీఎస్‌ సీ కాలనీలోని విద్యుత్తు ఐకాస నాయకుడు సంజీవయ్య గృహంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా సెప్టెంబరు 30 న నిర్వహించే తెలంగాణ మార్చ్‌ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తెలంగాణ ప్రజాస్వామిక డిమాండ్‌ను వెలుగుచూపాలని కోరారు. తెలంగాణ కళాకారుడు గౌతంరావు మృతికి తన ప్రగాఢ సంతాపం, కుటుంబానికి సానుభూతి తెలిపారు.