ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిందే

ఆర్టీసీ బస్టాండ్లలో ప్రకటనలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి): గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇప్పుడు పలు బస్టాండ్లలో ప్రయాణికులకు గమనిక ప్రకటనలు దర్శనిమిస్తున్నాయి. ఈ నెల 2న ప్రగతి నివేదన సభ సందర్భంగా బస్సులు మళ్లిస్తున్నామని, అందువల్ల ఆయా రూట్లలో బస్సుఉల తక్కువగా నడుస్తాయని పేర్కొంటూ ప్రకటనలు అంటించారు. ఉదయం నుంచి రాత్రి 12:00 గంటల వరకు ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సమావేశానికి వెళ్తున్నాయి. బస్టాండ్‌కు రావద్దని కోరుతున్నామని పలు బస్టాండుల్లో ఆర్టీసీ అధికారులు ఇప్పటికే గోడప్రతులను అతికించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 2న హైదరాబాద్‌ శివారలోని కొంగరకలాన్‌లో నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు భారీగా జనసవిూకరణ చేస్తుండటంతో జిల్లాల్లోని బస్సులను పార్టీ శ్రేణులు అద్దెకు తీసుకున్నాయి. ఇలా వేలాది బస్సులు సభకు వెళ్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. అవసరమైన చోట రైలు సౌకర్యం ఉన్న కొన్ని జిల్లాల్లో అదికూడా లేదు. దీంతో నిత్యం లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో బస్టాండ్‌లకు వచ్చిన వారు బస్సులు లేక తీవ్ర ఇక్కట్లుపడే పరిస్థితి ఉంది. గతంలో జరిగిన రెండు సమావేశాలకు జిల్లాల్లో బస్సులన్నీ పంపడంతో వచ్చిన వారు ఇబ్బందులకు గురయ్యారు. సెప్టెంబరు 2న ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఎవరైనా ఇతర గ్రామాలకు, నగరాలకు వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లకు చేరుకునేలా ప్రణాళిక చేసుకోవడం ఉత్తమం.. శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు బస్సులు రాకపోకలు ఉండవని గమనించాలనిఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలు కూడా ఆదివారం కావడంతో ప్రయాణాలు వాయిదా వేసుకుంటున్నారు. రోడ్లు కూడా జామ్‌ అయ్యే పరిస్తితి ఉంది. సొంతవాహనాల్లో వెళ్లినా రద్దీలో ఇరుక్కోక తప్పకపోవచ్చు.