బషీర్‌బాగ్‌పై సర్కారు మళ్లీ కుట్ర

-ఉద్యమ నేతలపైనే కేసులా
-సర్కారు తీరుపై విమర్శలు
హైదరాబాద్‌, నవంబర్‌ 7 (జనంసాక్షి):
బషీర్‌బాగ్‌ ఘటనపై సర్కారు మరోసారి కుట్ర పన్నింది.. శాంతియుతంగా ర్యాలీ తీస్తున్న వారిపై కాల్పులు జరిపి, మళ్లీ ఉద్యమ నేతలపైనే కేసులు పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి..దీనిపై సీపీఐ నేతలు తీవ్రంగా స్పందించారు. బషీర్‌బాగ్‌ కాల్పుల ఘటనలో సిఐడి తమపై ఛార్జీషీట్‌ దాఖలు చేయడం సమంజసం కాదని సిపిఐ జాతీయ ప్రదానకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. బుధవారం నాడు వారు మీడియాతో మాట్లాడుతూ తమపై సిఐడి ఛార్జీషీట్‌ ను దాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. ఘటన జరిగిన రోజు పోలీసులు తమకు శాంతియుత ప్రదర్శనకు అనుమతిచ్చి ఆ తర్వాత కాల్పులు జరిపారని నారాయణ ఆరోపించారు. ఆ ఘటనలో చనిపోయిన పోలీసు వారి బుల్లెట్‌ తగిలే చనిపోయారన్నారు. పోలీస్‌ బుల్లెట్‌ తగిలి పోలీసు చనిపోతే తమపై ఛార్జీషీట్‌ దాఖలు చేయడమేమిటని వారు ప్రశ్నించారు. ఆ పోలీసును రక్షించేందుకు తాము ప్రయత్నించామన్నారు. కానిస్టేబుల్‌ చనిపోయారని తమపై కేసులు పెడితే… మరి ఇదే ఘటనలో పోలీసుల కాల్పుల కారణంగా ముగ్గురు అమాయకులు మృతి చెందారని దానికి వారేం సమాధానం చెబుతారన్నారు. ఈ ఛార్జీషీట్‌ కాంగ్రెస్‌ కుట్రలో ఓ భాగం అన్నారు.
కాగా టిడిపి ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌, వామపక్షాలు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి పిలుపు హింసాత్మకంగా మారి… బషీర్‌బాగ్‌ వద్ద అది కాల్పులకు, రక్తపాతానికి దారి తీసి ఇప్పటికి 12ఏళ్లు పూర్తయింది. పుష్కర కాలం తరువాత ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చార్జీషీట్‌ దాఖలుకు సిఐడి సిద్ధం అవుతోంది. నాటి ఘటనకు అసలు బాధ్యులుగా భావించి లెఫ్ట్‌ నేతలు సురవరం సుధాకర్‌ రెడ్డి (ప్రస్తుత సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి), బివి రాఘువలు( సిపిఎం రాష్ట్ర కార్యదర్శి), పుణ్యవతి (రాఘవులు సహచరి, ఐద్వా జాతీయ నాయకురాలు), గుమ్మడి నర్సయ్య (సిపిఐ(ఎమ్‌-ఎల్‌) మాజీ ఎమ్మెల్యే), మానం ఆంజనేయులు (న్యూడెమోక్రసీ), కాంగ్రెస్‌ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి (ప్రస్తుతం ఏఐసిసి కార్యదర్శి) తదితర 28మందిపై కేసులు నమోదు చేసే దిశగా సిఐడి అడుగులు వేస్తోంది.