బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం: చంద్రబాబు
హైదరాబాద్: వాల్మీక బోయలను ఎస్టీలో చేర్చే వరకూ పోరాటం చేస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అనంతపురం, ఖమ్మం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలకు చెందిన వాల్మీక బోయ సంఘాలు ఇవాళ ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో చంద్రబాబును కలిశారు. ఇటీవల తెలుగుదేశం ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌పై ధన్యవాదాలు తెలుపుతూ బాబును ఘనంగా సత్కరించారు. 50శాతం పైగా బీసీలకు సామాజిక న్యాయం చేయడానికి బీసీ డిక్లరేషన్ ప్రకటించినట్లు చంద్రబాబు తెలిపారు. తెదేపా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు భయపడి కేంద్రమంత్రి బైపాల్‌రెడ్డి 27శాతం పెట్రోల్ బంక్‌లను వెనకబడిన వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించడం రాబోయే పరిణామాలకు శుభసంకేతంగా ఆయన పేర్కొన్నారు.