భాజపాను ఓడించండి
ఐదు రాష్ట్రాల్లో పర్యటిస్తానీ తికాయత్
కోల్‌కతా,మార్చి13 (ఆర్‌ఎన్‌ఎ): ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని, ఆ పార్టీతోపాటు ఆపార్టీ అభ్యర్థులను బహిష్కరించాలని రైతు ఉద్యమం నేతలు ఓటర్లకు పిలుపునిస్తున్నారు. ఇకపోతే కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన రైతుల ఉద్యమం పశ్చిమ బెంగాల్‌కు చేరుకున్నది. రైతులకు కీడు చేసే కొత్త చట్టాల గురించి ప్రజలను చైతన్యం చేస్తామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం నాయకుడు రాకేశ్ తికాయత్ శనివారం పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. కోల్‌కతాలోని భవానిపోరా, నందిగ్రామ్‌లో నిర్వహిస్తున్న రైతు మహాపంచాయతీల్లో పాల్గొని కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఆదివారం నాడు సింగూర్, అసన్సోల్లో కూడా రైతు మహా పంచాయతీలను నిర్వహించనున్నారు. మమతా బెనర్జీని ఢీకొని పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తామని భావిస్తున్న బీజేపీ నేతలకు బీకేయూ నేత రాకేశ్ తికాయత్ సవాల్ విసురుతున్నారు. తాము గత వంద రోజులకుపైగా దేశరాజధాని సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, దీనికి ప్రతిగా రైతులతోపాటు ఓటర్లను చైతన్యవంతం చేసే పనిని బీకేయూ నేతలు భుజానికెత్తుకున్నారు. ఈ మేరకు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. దానిలో భాగంగా శనివారం నాడు బీకేయూ నేత రాకేశ్ తికాయత్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మహాపంచాయతీలు నిర్వహిస్తున్నారు. బీకేయూతోపాటు యునైటెడ్ కిసాన్ మోర్చా (ఎస్కేఎం) కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్‌ను ప్రారంభించింది. వీరు కూడా బీజేపీని బహిష్కరించాలని, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయవద్దని ఇప్పటికే బెంగాల్‌లోని మారుమూల గ్రామాల్లో ప్రచారం చేపట్టారు. బీజేపీకి గుణపాఠం నేర్పేందుకే ఈ ఉద్యమం చేపట్టామని, అయితే ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని, ఓ ఒక్కరికి ఓటేయాలని కోరడం లేదని ఎస్కేఎం నాయకుడు యోగేంద్ర యాదవ్ తెలిపారు. కొన్ని కార్పొరేట్లకు దేశాన్ని విక్రయించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ ఆరోపించారు. ప్రజలు తమ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. రైతులను అవమానిస్తున్న కేంద్రానికి తగిన బుద్ధి చెప్పాలని ఆమె సూచించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాన్ని బెంగాల్ శాసనసభ ఆమోదించడాన్ని మేధాపాట్కర్ స్వాగతించారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నట్లు చెప్తున్న బీజేపీ ప్రభుత్వం.. రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.