భాజపా, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిపక్ష హోదా లేదు
అదానీ అంబానీలకు వత్తాసు ఈటల రాజకీయ బ్రోకర్◆ సంగ్రామ యాత్ర అట్టర్ ప్లాఫ్
◆ ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలి మీడియా సమావేశంలో బీ ఆర్ ఎస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు
మానకొండూరు, ఆర్ సి ఫిబ్రవరి 25( జనం సాక్షి) ఈటల రాజేందర్ రాజకీయ బ్రోకర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు భారత రాష్ట్ర సమితి పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు. చొప్పదండి, మానకొండూరు, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో ( స్ట్రీట్ కార్నర్) కూడలి సమావేశాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. ఆరోపణలను నిర్విధ్దంగా ఖండించారు. ఈటల, భాజపా నేతల వ్యాఖ్యలపై రామకృష్ణారావు నిప్పులు చెరిగారు. భాజపా స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర అట్టర్ ప్లాఫ్ అయిందని, కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని దూషించడానికే మాత్రమే యాత్రను సరిపెట్టారని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలను ఎలా కూల్చాలి, ఆదాని, అంబానీలకు దేశ సంపదను ఎలా కట్ట పెట్టాలనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ముందంజలో ఉందని తేల్చి చెప్పారు. నిరంతర నాణ్యమైన విద్యుత్తును అందించిన ఘనత తమదేనన్నారు. శనివారం మానకొండూరు లోని క్యాంపు కార్యాలయంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా ప్రాదేశిక సభ్యులు తాళ్లపల్లి శేఖర్ గౌడ్, స్థానిక సర్పంచ్ రోడ్డ పృథ్వీరాజ్, నాయకులు శాతరాజు యాదగిరి, నెల్లి మురళి , పిట్టల మధు, నెల్లి శంకర్ ,ఆడప శ్రీనివాస్, పార్నంది కిషన్, కడారి ప్రభాకర్, తదితరులు, పార్టీ వర్గాలతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్రలో సుమారు 86 వేల మంది విద్యుత్ ఉద్యోగులు విద్యుత్ రంగాన్ని అదానికి అప్ప చెప్పకుండా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న సంగతి ఈటల గ్రహించాలన్నారు. గోవా రాష్ట్రంలో ఏడు నుండి ఎనిమిది గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, ఉత్తరప్రదేశ్ లో మూడువేల మెగావాట్ల తరుగు విద్యుత్తు డిమాండ్ ఉందని చెప్పారు. రైతుబంధు, రైతు భీమా, రైతు కళ్ళాలు, రైతు రుణమాఫీ తదితర సంక్షేమ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ అగ్రగామిగా ఉందని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన ఎనిమిదేళ్ళ పాలనలో ఐటీ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చిన ఘనత కేటీఆర్ దే అని ఆయన చెప్పారు. 119 అసెంబ్లీ స్థానాలకు గాను, 104 అసెంబ్లీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకుందని కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రతిపక్ష హోదా లేదనే విషయం ఈటల గ్రహించాలని సూచించారు. మండలిలో అసలు సభ్యులే లేరన్నారు. భాజపా ఎమ్మెల్యేలు, ఎంపీలైన 58 మంది పై మహిళలపై అత్యాచార కేసులు ఉన్నాయనే విషయాన్ని ఈటల మరచిపోయారా అని ప్రశ్నించారు. స్వయం సహాయక గ్రూపులు, బతుకమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తదితర పథకాలతో మహిళలకు సముచిత స్థానం ,ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో భాజపా నాయకులు ఎందుకు విఫలమయ్యారని మీడియా సాక్షిగా నిలదీశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడుందని, ఏమైందని చురకలంటించారు. భూ కబ్జాల చరిత్ర ఈటల రాజేందర్ దే అని ఎద్దేవా చేశారు. వేములవాడ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కేసీఆర్ ఆలయాల ఆధునీకరణకు కృషి చేస్తున్నారని, వేములవాడ తో పాటు, ధర్మపురి దేవాలయాలను ఆధునీకరించటానికి బృహత్ ప్రణాళికలను రూపొందించామని, ఈ విషయంలో కంకణ బద్ధులై ఉన్నామని తేల్చి చెప్పారు . అవగాహన లేని, మతిలేని ఈటల రాజేందర్ తక్షణం వ్యాఖ్యలు ఉపసంహరించుకుని, బే షరతుగా క్షమాపణ చెప్పాలని రామకృష్ణారావు డిమాండ్ చేశారు