మంత్రివర్గంలో చేరికపై రాహుల్‌ అనాసక్తి

న్యూఢిల్లీ: రాహుల్‌ గాంధీకి ఈసారి మంత్రివర్గంలో స్థానం ఖాయమని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన మంత్రివర్గంలో చేరేందుకు సుముఖంగా లేరని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల అనంతరం  ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటారని వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు మీడియా వ్యక్తులతో  చెబుతున్నారు. పార్టీ  నాయకత్వం ఈ సారి ఆయన మంత్రిగా చేరి ప్రభుత్వం నడిచే తీరుపై అవగాహన పెంచుకోవాలని భావిస్తుండగా ఆయన మాత్రం పార్టీలోనే పనిచేయాలని భావిస్తున్నారు. దీంతో ఆయనకు పార్టీ ఉపాధ్యక్ష పదవికాని సెక్రటరీ జనరల్‌ పదవికాని ఇచ్చే అవకాశం ఉంది. ఈ పదవిని గతంలో హెచ్‌ఎస్‌ బహుగుణకోసం సృష్టించి ఇచ్చారు. అదే జరిగితే ప్రభుత్వంలో జ్యోతిరాదిత్యసింధియా, సచిన్‌పైలేట్‌, అజయ్‌మాకెన్‌ వంటి యువనాయకత్వానికి కూడా కొంతమేరకు నష్టమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.