మంత్రి కొప్పుల చేతుల మీదుగా జాతీయ పంచాయతీ అవార్డులు అందుకున్న జూలపల్లి సర్పంచ్

 జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామపంచాయతీ చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ, వాటర్ సఫిషియన్ట్ పంచాయతీ విభాగాల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా జాతీయ పంచాయతీ అవార్డులకు ఎంపిక కాగా శుక్రవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ సమక్షంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేతుల మీదుగా జూలపల్లి సర్పంచ్ బొల్లపల్లి శంకర్ గౌడ్ అవార్డులను అందుకున్నారు. సర్పంచ్ శంకర్ గౌడ్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశంసా పత్రం, షీల్డ్ తో అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ… అధికారుల, పాలకవర్గ సభ్యుల సహకారంతో జూలపల్లి గ్రామపంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేయడం జరిగిందని, జిల్లా స్థాయిలో రెండు విభాగాల్లో తమ జిపి కి జాతీయ పంచాయతీ అవార్డులు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ రఘువీర్ సింగ్, కమాన్ పూర్ ఎంపీడీవో విజయ్ కుమార్, ఎంపీఓ శేషయ్య సూరి, పంచాయతీ కార్యదర్శి వెంకట రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.