మరో మోసానికి కాంగ్రెస్ పార్టీ కుట్ర
హైదరాబాద్: తెలంగాణ ప్రాంత ప్రజల సహనాన్ని పరిక్షిస్తోంది. కేంద్ర ప్రభుత్వం, సీమాంధ్ర పెట్టుబడిదారుల ఒత్తిడికి తలొగ్గి తెలంగాణపై మరో మోసానికి కుట్ర పన్నింది. ఏకాభిప్రాయంపేరుతో పార్టీకి ఇద్దరి చొప్పున అఖిలపక్షానికి ఆహ్వానించి మల్లా గందరగోళానికి తెర లేపింది. సమస్య పరిష్కారం ఇష్టం లేని కాంగ్రెస్ పార్టీ తన అనైతికతను బయటపెట్టుకొంది. కావాలనే కేంద్రం తెలంగాణపై నాన్చివేత ధోరణి అవలింభిస్తోందని తెలంగాణవాదులు మండి పడుతున్నారు. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీతో ఒప్పందం మేరకే కేంద్రం ఈవిధమైన డ్రామాలాడుతోందంటున్నారు. ఇద్దరు వెళ్లినా ఒక్క పార్టీ ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాలని టీఆర్‌ఎస్ పార్టీ, తెలంగాణ ప్రజలు, మేథావులు, విద్యార్థులు, న్యాయవాదులు , జర్నలిస్టులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశంలో స్పష్టమైన వైఖరిని చెప్పి పార్టీలు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అడగుతున్నారు. తెలంగాణకు అడ్డుకాదు అని చెబుతున్న టీడీపీ, వైసీపీలు తమ అభిప్రాయాన్ని తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని, అదీ లిఖిత పూర్వకంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.