మహరాష్ట్ర రసాయన పరిశ్రమలో ఘోరప్రమాదం

ఎనిమిది మృతి.. 60 మందికి గాయాలు
ముంబై, మే 23 (జనంసాక్షి) : మహారాష్ట్రలోని థానేలో ఓ రసాయన పరిశ్రమలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికిపైగా గాయాలపాలయ్యారు. దోంబివిలి ఎంఐడీసీ ఫేజ్‌-2 ప్రాంతంలోని అముదాన్‌ కెమికల్‌ కంపెనీలో గురువారం మధ్యాహ్నం రియాక్టర్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు వెల్లడిరచారు.
ఫ్యాక్టరీలో మూడు పేలుళ్లు వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కనీసం ఎనిమిది మందిని రక్షించినట్లు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, ఇతర అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. దొంబివిలి ఎంఐడీసీలోని అముదన్‌ కెమికల్‌ కంపెనీలో బాయిలర్‌ పేలిన ఘటన బాధాకరమని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ అన్నారు. ఈ ఘటనలో 8 మందిని రక్షించారని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక పేలుడు ధాటికి ఘటనాస్థలిలో పెద్ద బిలం ఏర్పడిరది. పేలుడు కారణం గాజు కిటికీలు దెబ్బతిన్నాయి. బాయిలర్‌ పేలుడు కారణంగా ఉత్పత్తి చేయబడిన వేడి భారీ ఇనుప కిరణాలు వంగిపోయేలా చేసింది. పక్కనే ఉన్న ఫ్యాక్టరీల పైకప్పులు ఎగిరిపోయి భారీ నష్టం వాటిల్లింది. పేలుడు శబ్ధం కిలోమీటరు దూరం నుంచి వినిపించింది. ఈ పరిశ్రమలో కొందరు చిక్కుకున్నారని, వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.