మాపై ఎందుకు ఈ వివక్ష ఎంపీడీవో గోవిందరావును నిలదీసిన సర్పంచులు

దంతాలపల్లి సెప్టెంబర్ 1 జనం సాక్షి

 

మాపై ఎందుకు వివక్ష చూపుతున్నారని స్థానిక ఎంపీడీవో బండి గోవిందరావు వివిధ గ్రామాల సర్పంచులు నిలదీశారు. వివరాల్లోకి వెళితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన ఆసరా పెన్షన్ కార్డుల పంపిణీలో తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా అవమానించారని మండలంలోని దాట్ల గున్నేపల్లి ఆగపేట గ్రామాల సర్పంచులు కొమ్మినేని రవీందర్,గండి వెంకటనారాయణ గౌడ్, ఇమ్మడి సంధ్య లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో వారు మాట్లాడుతూ… ప్రభుత్వ నూతన ఆసరా పెన్షన్ల పంపిణీ విషయంలో అధికారులు సమాచారo ఇవ్వకుండా ఇస్తానుసారంగా ప్రవర్తిస్తున్నారని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలియజేయకపోవడమే కాకుండా తమ గ్రామాలలో ఆసరా పెన్షన్లను ఎంపీటీసీల చేతుల మీదుగా పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. మమ్ములను అగౌరవపరచడం సరైనది కాదని వారు హితవు పలికారు. తక్షణమే పెన్షన్ కార్డులను గ్రామ సర్పంచ్ ల పంచాయతీ కార్యదర్శుల సమక్షంలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. స్పందించిన ఎంపీడీఓ ఒక్కరోజు సమయాన్ని ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.