మోదీ పథకం తుస్సుమంటుంది

– బీఎస్పీ అధినేత మాయావతి
పాట్నా, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రైతులు, భూముల్లేని కార్మికుల మధ్య వ్యత్యాసాన్ని మోదీ సర్కార్‌ గ్రహించాలని బీఎస్పీ అధినేత మాయావతి అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద నెలకు రూ.500 ఇవ్వడం కార్మికులకు ఉపయోగిస్తుందని, తమ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కోరే రైతులకు ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో విఫలమైందని, ఇది కచ్చితంగా వైఫల్యమేఅని ఆమె అన్నారు. ‘సంగం’లో ప్రధాని పవిత్ర స్నానంపై కూడా మాయావతి విసుర్లు విసిరారు. ఎన్నికల వాగ్దానాలకు తూట్లు పొడవడం, విశ్వాసఘాతకం, ఇతర పాపాలను సంగంలో స్నానం చేసినంత మాత్రాన మోదీ పోగొట్టుకోలరా అంటూ ప్రశ్నించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్‌టీ, ప్రతీకారతత్వం, కులతత్వం, మతతత్వం, అధికారవాదంతో ప్రజల జీవితాలను కడగండ్ల పాలు చేసిన బీజేపీని ప్రజలు క్షమించే అవకాశమే లేదని మాయావతి నిప్పులు చెరిగారు.