రోగాల గుమ్మం ఖమ్మం విషజ్వరాలతో తల్లడిల్లుతున్న ప్రజలు

ఖమ్మం, అక్టోబర్‌ 9 : దోమల ఉధృతికారణంగా రోగాలు ప్రబలుతుండటంతో ఖమ్మం పట్టణ ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. ఖమ్మం పట్టణంలోని దాదాపు 15 ప్రాంతాలు జ్వర సమస్యాత్మకంగా గుర్తించామని మున్సిపల్‌ అధికారులు ప్రకటించడం విశేషం. జ్వరాల తీవ్రతకు నిదర్శనంగా ఏ ఆస్పత్రిలో చూసినా కూడా రోగులు బారులు తీరుతున్నారు. దోమలను అరికట్టడంలో మున్సిపల్‌ అధికారులు విఫలం కావడంతో జ్వరం బారిన పడకుండా ఉండాలని ప్రజలు దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. ప్రమాదకరమైన డెంగీ తదితర విష జ్వరాలు అధికం కావడంతో జ్వరం పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. చిన్నపిల్లలకు ఒళ్లు కాస్త వెచ్చబడగానే తల్లిదండ్రుల గుండెలు గుభేల్‌ మంటున్నాయి. విషజ్వరాల బారిన పడిన పలువురు మృత్యువాత పడడం ఆందోళనకు కారణం అవుతోంది. ప్లేట్‌లెట్లు తగ్గిపోవడంతో తదితర పరీక్షలకు వేలాది రూపాయలు ఖర్చు చేసిన కొన్ని కేసుల్లో ఫలితం ఉండకపోవడంతో ప్రజలు దినదిన గండంగా బతుకుతున్నారు. ఇక పేదల ప్రజల వారు జ్వరాల బారిన పడితే దేవుడే దిక్కుగా మారింది. పట్టణంలో దోమల స్వేరవిహారం చేస్తుండటంతో ఏ ఇంట్లో ఎవరు ఏక్షణాన జ్వరాన బారిన పడతారో తెలియకుండా ఉంది. విష జ్వరాల వల్ల ప్రాణహాని ఉండటంతో జ్వరం పేరు వినగానే ప్రతి ఒక్కరూ ఉలిక్కిపడుతున్నారు. గుడిసె వాసులు, శివారు కాలనీ వారు మాత్రమే జ్వరాల బారిన పడుతున్నారంటే పొరపాటే. సాక్షాత్తూ కలెక్టర్‌తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం దోమకాటుకు గురై మంచానపడిన  సంగతి తెలిసిందే. దోమలపై సమరం పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన మున్సిపల్‌ అధికారుల వైఖరి కేసులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉందని జ్వరాల బాధితులు ఆరోపిస్తున్నారు. దోమలను అరికట్టేందుకు ఫాగింగ్‌, ఆయిల్‌ బాల్స్‌, గంభూషియా చేపలతో పాటు మురుగు కాలువలు, చెత్తా చెదారం తరలింపు వంటి చర్యలు యుద్ధప్రాతిపదికన చేయాల్సి ఉండగా, ఆమేరకు వెనుకబడటం వల్లే ప్రమాదకర పరిస్థితికి కారణమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఖమ్మం పట్టణం వ్యాప్తంగా దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ముగ్గురు శానటరీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు ఖాళీ అయినా కూడా వాటిని భర్తీ చేయకపోవడంతో నాలుగైదు నెలలుగా ఖమ్మం పట్టణంలో పారిశుద్ధ్యం లోపించింది. రెండు లక్షల జనాభా ఉన్న పట్టణంలో సాధారణ ఉద్యోగులకు పారిశుద్ధ్యం నిర్వహణ బాధ్యత అప్పగించడంతో మురుగు కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయాయి.