వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త గనుల నుంచి 134 లక్షల బొగ్గు ఉత్పత్తి……… తద్వారా 750 లక్షల వార్షిక లక్ష్య సాధన……. కొత్త ప్రాజెక్టుల సమీక్షలో సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్..
– జనం సాక్షి – హైదరాబాద్వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24లో సింగరేణి సంస్థ 750 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది చేపట్టే ఐదు ప్రధాన గనుల నుంచి కనీసం 134 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్. శ్రీధర్ ఆదేశించారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో శుక్రవారం నాడు ఆయన రానున్న రెండేళ్లలో చేపట్టే కొత్త ప్రాజెక్టులపై సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, ప్రాజెక్టు ప్లానింగ్ విభాగం జీఎంలు, సంబంధిత ఏరియా జీఎంలతో సుదీర్ఘంగా సమీక్షించారు.వచ్చే ఏడాది ఒడిశా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి కనీసం 60 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని, కొత్త గూడెంలోని వీకే ఓసీ నుంచి 30 లక్షల టన్నులు, బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీ నుంచి 4 లక్షల టన్నులు, ఇల్లందులోని జేకే ఓసీ గని నుంచి 10 లక్షల టన్నులు, రామగుండం కోల్ మైన్ నుంచి 30 లక్షల టన్నుల ఉత్పత్తిని సాధించాలని ఆయన లక్ష్యాలను నిర్దేశించారు. ఈ కొత్త గనుల్లో కొన్నింటికి ఇప్పటికే పూర్తిస్థాయి అనుమతులు లభించాయని, మిగిలిన గనులకు సంబంధించిన అన్ని అనుమతులను సత్వరమే సాధించాలని ఆదేశించారు. 2024-25లో చేపట్టనున్న ఎంవీకే ఓపెన్ కాస్టు, తాడిచర్ల-2 తదితర గనుల అనుమతులకు కూడా ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఎన్. బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), డైరెక్టర్ (ఈ అండ్ ఎం)డి. సత్యనారాయణ రావు, ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి. వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), అడ్వైజర్లు డి.ఎన్. ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) ఎం. సురేశ్, జీఎం. (సీపీపీ) సి.హెచ్. నరసింహారావు, జీఎం (మార్కెటింగ్) కె. సూర్యనారాయణ, జీఎం ఎస్టేట్స్ రవిప్రసాద్, జీఎం (పిపి) కె. కొండయ్య, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు, కొత్తగూడెం కార్పొరేట్ నుంచి వివిధ విభాగాల జీఎంలు పాల్గొన్నారు.
Related