విచారణకు హాజరైన రాజ్‌ పాకాల

` జన్వాడ ఫామ్‌హౌజ్‌ కేసులో పోలీసుల ఎదుటకు కేటీఆర్‌ బావమరిది
హైదరాబాద్‌(జనంసాక్షి): జన్వాడ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌ బావమరిది రాజ్‌ పాకాల మోకిల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి జరిగిన సమయంలో అదృశ్యమైన పాకాల బుధవారం పోలీసుల ఎదుట ప్రత్యక్షం అయ్యారు. అలాగే హైకోర్టులో ముందస్తు బెయిల్‌ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలో న్యాయవాదితో పాటు ఆయన విచారణకు వచ్చారు. నార్సింగి ఏసీపీ రమణ గౌడ్‌ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది. ఇటీవల రాజ్‌ పాకాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కేసుకు సంబంధించి విచారించాల్సి ఉందని అందులో పేర్కొన్నారు. జన్వాడలో ఫామ్‌హౌస్‌పై ఇటీవల సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. ఇక్కడి రిజర్వ్‌ కాలనీలో ఉన్న రాజ్‌ పాకాల ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 21 మంది పురుషులు, 14 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. 35 మందితో నిర్వాహకులు మద్యం పార్టీ నిర్వహిం చారు. డ్రగ్స్‌ పరీక్షలు నిర్వహించిన పోలీసులు.. రాజ్‌ పాకాల స్నేహితుడు విజయ్‌ మద్దూరి కొకైన్‌ తీసుకున్నట్లు నిర్ధరించారు. ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగానే రాజ్‌ పాకాలకు నోటీసులు ఇచ్చారు.