సవరణలు సరిపోవు
– నూతన వ్యవపాయ చట్టాలను రద్దు చేయాల్సిందే
– నిర్దిష్ట ప్రతిపాదనలతో రండి
– కేంద్ర సర్కారు రైతు సంఘాలు డిమాండ్
దిల్లీ,డిసెంబరు 23 (జనంసాక్షి):వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని విమర్శించారు. దీనిపై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖరాసినట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై సమావేశమై రైతు నేతలు చర్చించారు. అనంతరం సాయంత్రం సింఘూ సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు విూడియాతో మాట్లాడారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, గతంలో సవరణలు చేస్తామంటూ ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామన్నారు. ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని.. తద్వారా తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులు చర్చలకు ఇష్టంగా లేరనే ప్రచారం అవాస్తవమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి. కేంద్రం రాతపూర్వక హావిూలతో రావాలని కోరుతున్నట్టు రైతులు చెప్పారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని మరోసారి డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తేవాలని కోరారు. ఇలాంటి లిఖితపూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామని తేల్చి చెప్పారు. చర్చలు ఫలప్రదంగా సాగేందుకు అనువైన వాతావరణాన్ని కేంద్రం సృష్టించాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో చర్చలకు కేంద్రం రైతులను మరోసారి ఆహ్వానిస్తుందా? లేదా? సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకొని.. కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనలతో రావాలంటున్న రైతుల డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది కాగా మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ డిసెంబరు 25న రైతులను ఉద్దేశించి వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్ర వైఖరిని రైతులకు స్పష్టం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథక నిధులు రూ. 18వేల కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు ప్రభుత్వ పథకాల ద్వారా వారు పొందిన లాభాల గురించి మాట్లాడతారని ఆ ప్రకటనలో వెల్లడించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సమావేశం జరిగిన తర్వాత నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలు తొలగిపోతాయని ఆశిస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ రాసిన లేఖను రైతులంతా చదవాలని ప్రధాని కోరారు. గతవారం మధ్యప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో రైతులతో ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ప్రతిపక్షాలు రైతులను పెడదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. కాగా బుధవారం జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు నిరాహార దీక్ష చేస్తున్నామని ప్రకటించారు.