-సావిత్రీబాయి పూలే,రమాదేవి అంబేడ్కర్ పోరాట ఫలితమే మహిళలకు ప్రభుత్వ ఫలాలు

.

 

 

 

-డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్.పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్.
-శాయిన్ పల్లి సర్పంచ్ ఆద్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంత మహోత్సవం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, మార్చి 8(జనంసాక్షి):

సావిత్రీబాయి పూలే,రమాదేవి అంబేడ్కర్ వంటి మహిళా మణుల పోరాటాల ఫలితంగానే నేడు మహిళలకు ఉన్నత విద్య, ఉద్యోగాలలో సమాన ప్రాతినిధ్యం వంటి ఫలాలు అందుతున్నాయని పాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెబ్బేటి మల్లికార్జున్ అన్నారు.బుదవారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల పరిధిలోని సాయిన్ పల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ మస్కూరి అవంతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సామూహిక శ్రీమంతాల మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పెబ్బేటి మల్లికార్జున్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం అద్భుతమని,ఎక్కడా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదని,ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచ్ కు అభినందనలు తెలిపారు. మహిళా ప్రజా ప్రతినిధులు ఉన్నచోట వారి భర్తలే పనులు నిర్వహిస్తున్న పరిస్థితులలో భార్యను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహింప జేస్తున్న సర్పంచ్ భర్త మస్కూరి శంకర్ ను అభినందించాలని అన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య రమాబాయి అంబేద్కర్ ఆశయాలకు చాలా మద్దతు ఇచ్చిందని మరియు వారి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళమని కూడా ప్రోత్సహించిందని తెలిపారు అంబేద్కర్ తన చదువుల కోసం విదేశాలలో ఉన్నప్పుడు ఆమె చాలా పేదరికం మరియు కష్టాలను భరించిందని గుర్తు చేశారు. మహిళలు ఎన్నో కష్టాలను ఓర్చుకొని తన కుటుంబం బాధ్యతను నెరవేరుస్తుందని కొనియాడారు. అలాగే చట్టసభలలో మహిళలకు పురుషులతో సమాన ప్రాతినిధ్యం కల్పిస్తే సమాజాన్ని కూడా బాధ్యతతో అభివృద్ధి చేస్తారని అన్నారు. స్త్రీలలో అక్షరాస్యతను కల్పిస్తే చైతన్యవంతులు అవుతారని 1848లో తన భర్త జ్యోతిరావు పూలే తో కలిసి క్రింది కుటుంబాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించిందని అన్నారు దీంతో ఆమెపై వేధింపులకు భౌతిక దాడులకు పూనుకున్నారని అన్నారు. అయినా వారి వేధింపులకు భయపడక మొత్తం 54 పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికలకు ఉన్నత చదువును అందించిన మహాత్మురాలని కొనియాడారు. 1852లో మహిళా సేవ మండల్ అనే మహిళా సంఘాన్ని స్థాపించి లింగ సమస్యలకు తోడుగా పోరాటాలు చేసి మహిళలకు బాసటగా నిలిచిందని అన్నారు. కావున సావిత్రిబాయి పూలే రమాదేవి అంబేద్కర్ వంటి పోరాటం పటిమ గల మహిళలను ఆదర్శంగా తీసుకొని ధైర్యంతో అభివృద్ధి ఫలాలను అందుకోవాలని సూచించారు.
సర్పంచ్ మస్కూరి అవంతి మాట్లాడుతూ మహిళలు ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో చైతన్యవంతులైనప్పుడే సమాజాభివృద్ధి మహిళా సాధికారత జరుగుతుందని అన్నారు. గ్రామ ప్రజల క్షేమం కోసం ఇలాంటి మరెన్నో కార్యక్రమాలను నిర్వహించడానికి ఎల్లప్పుడు సంసిద్ధతతో ఉంటానని అన్నారు.గర్భిణి మహిళలు ఆరోగ్యవంతమైన మాతృత్వాన్ని పొందాలని, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండడం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా పుడతారని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భర్త మస్కూరి శంకర్ ఆశా కార్యకర్తలు మహిళలు యువతి యువకులు పాల్గొన్నారు.