సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు వీడ్కోలు?

దక్షిణాఫ్రికా పర్యటన నుంచి వచ్చాక ముహూర్తం!
హైదరాబాద్‌,జూలై 6 : వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తుల కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వివి లక్ష్మీనారాయణకు ఉద్వాసన పలికే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన దక్షిణాఫ్రికాకు 9 రోజుల పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలోని ఏజెన్సీ ప్రధాన కార్యాలయంలో ఆయనకు మరో ఏడాది పొడిగింపు ఇచ్చే విషయమై తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఆయనకు పొడిగింపు ఇవ్వాలా లేదా ఆంధ్రప్రదేశ్‌ నుంచి బైటకు పంపాలా అనే విషయమై చర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. జూన్‌లో ఆయన పొడిగింపు కాలం ముగిసింది. మరల పొడిగింపు ఇవ్వాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ పదవి కోసం కొంత మంది ఐపీఎస్‌ అధికారులు పోటీ పడుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా సీబీఐలో ఒక సాంప్రదాయం ఉంది. ఎంత సమర్థుడైన అధికారైనా ఏడాదికి మించి పొడిగింపు ఇవ్వరు. చర్చలు జరుగుతున్నప్పటికీ ఆయనకు మరల పొడిగింపు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువని విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్‌ ఆస్తుల గురించి, ఎంఆర్‌ కుంభకోణం గురించి చాలా వరకు దర్యాప్తు ముగిసినట్టే. చార్జీషీట్లు కూడా దాఖలయ్యాయి. ఇంకా చాలా పని జరగాల్సి ఉంది. అయితే ఇందుకు లక్ష్మీనారాయణ మాత్రమే అవసరం లేదు అని ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి చెప్పారు. ఢిల్లీలోని పరిణామాల గురించి ఆయనకు తెలుసు. ఇప్పుడు కాకపోయినా మరి కొన్ని రోజులలో వివిని సాగనంపేది ఖాయమని ఆయన చెప్పారు. 2006లో సీబీఐ ఆంధ్రప్రదేశ్‌ యూనిట్‌లో వివికి పోస్టింగ్‌ ఇచ్చారు. సుమారు ఐదేళ్ల పాటు ఆయన ఇక్కడ విధులు నిర్వహించారు. ఆ వ్యవధి ముగిసిన తరువాత ఢిల్లీలోని సీబీఐ పెద్దలు ఆయనకు ఒక ఏడాది పొడిగింపును మంజూరు చేశారు. జూన్‌లో ఇదిగి ముగిసింది. సీబీఐలో పొడిగింపు చాలా అరుదు. ఎంత ప్రతిభావంతులకైనా ఈ అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది. ఏడాది పొడిగింపు ఇవ్వటమే సాధారణం. ఇక కొద్ది నెలల్లో పని ముగించి కొత్త అధికారికి చార్జి ఇవ్వాలని ఆయనకు ఆదేశాలు రావచ్చు అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాగా వివి కాల్‌ రికార్డ్స్‌ డాటా(సీడీఆర్‌)ను సాక్షి టీవీ చానెల్‌, ప్రతిక వెల్లడించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడినట్టు వెల్లడి కావటంతో ఇదే విషయం సీబీఐ పెద్దల మదిలో ప్రభావం చూపవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. దక్షిణాఫ్రికా నుంచి రాగానే ఆయనను వేరేచోటకు పంపవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. సీబీఐ జేడీ పదవి కోసం ఇప్పటికే కొంత మంది ఐపీఎస్‌ అధికారులు లాబీయింగ్‌ చేస్తున్నట్టు తెలిసింది.