సీమ ఎత్తిపోతలు ఆపండి


` కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ
` కృష్ణా,గోదావరి వివాదాలపైనా మంత్రితో చర్చలు
న్యూఢల్లీి,సెప్టెంబరు 25(జనంసాక్షి):పాలమూరు రంగారెడ్డికి పూర్తిస్థాయి అనుమతులివ్వాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను సీఎం కెసిఆర్‌ కోరారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌ నోటిఫికేషన్‌ అభ్యంతరాలపై కూడా కేసీఆర్‌ చర్చించారు. ఢల్లీి పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌.. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఏపీతో జల వివాదాలు, కృష్ణా యాజమాన్య బోర్దు పరిధి తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌ తన గత పర్యటనలోనూ ఇదే అంశంపై దాదాపు 2 గంటలపాటు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సహా పలు ప్రాజెక్టులను వీలైనంత తొందరగా పూర్తి చేయడానికి సీఎం కేసీఆర్‌ కేంద్రం నుంచి సహకారం కోరారు. అలాగే పాలమూరు జిల్లా రైతులకు ప్రజలకు త్రాగునీరు, సాగునీరు లభిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో భేటీ తర్వాత కేసీఆర్‌.. కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై గోయల్‌తో చర్చించనున్నారు. ఆదివారం తొమ్మిది రాష్టాల్ర సీఎంలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సమావేశం కానున్నారు. మావోయిస్టు ప్రభావిత రాష్టాల్ర ముఖ్యమంత్రులతో పలు అంశాలపై చర్చించనున్నారు. మావోయిస్ట్‌ ప్రభావిత జిల్లాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర హోంశాఖ నుంచి వంద శాతం నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశం కావటంతో… కేంద్రమే పూర్తి ఖర్చు భరించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. నేడు ఢల్లీి విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్‌ పాల్గొంటారు. సీఎం వెంట ఢల్లీికి వెళ్లిన అధికారుల్లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.