సెకండ్‌ వేవ్‌ ఇంకా ముగియలేదు


` కేంద్రం హెచ్చరిక
` 18 ఏళ్లు పైబడిన వారిలో 66% మందికి తొలి డోసు పూర్తి
` దివ్యాంగులకు ఇంటి వద్దే టీకా
దిల్లీ,సెప్టెంబరు 23(జనంసాక్షి): దేశంలో కొవిడ్‌ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ ఇంకా మనం సెకండ్‌ వేవ్‌ మధ్యలోనే ఉన్నామని.. ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఒక్క కేరళలోనే లక్షకు పైగా క్రియాశీల కేసులు ఉన్నాయని, గత వారంలో నమోదైన మొత్తం ఇన్ఫెక్షన్లలో 62.73% కేసులు ఆ రాష్ట్రం నుంచే వచ్చాయని పేర్కొంది. దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు విూడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 33 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా ఉండగా.. 23 జిల్లాల్లో 5 నుంచి 10శాతం మధ్య ఉన్నట్టు తెలిపారు. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో 66శాతం మంది కనీసం ఒక్క డోసు తీసుకున్నారనీ.. 23శాతం మందికి రెండు డోసులూ పూర్తయినట్టు వెల్లడిరచారు. కొన్ని రాష్ట్రాల అసాధారణ కృషితో ఈ లక్ష్యం సాధ్యమైందన్నారు. దివ్యాంగులు, వయోభారంతో ఇళ్ల దగ్గర ఉండేవారికిఇంటి వద్దే కొవిడ్‌ టీకా అందించనున్నట్టు నీతి ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ వెల్లడిరచారు.మరోవైపు, వరుసగా 12వ వారం కూడా వీక్లీ పాజిటివిటీ రేటు తగ్గుదల కొనసాగిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడిరచారు. దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 3శాతం కన్నా తక్కువే ఉండగా.. రికవరీ రేటు 97.8%గా ఉన్నట్టు వివరించారు. దేశంలో పలు కేంద్రపాలితప్రాంతాలు, రాష్ట్రాల్లో కొవిడ్‌ టీకా వేసుకొనేందుకు అర్హులైన జనాభాలో 90శాతం మందికి తొలి డోసు పంపిణీ జరిగిందని, ఈ జాబితాలో దాద్రానగర్‌ హవేలీ, కేరళ, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌ ముందు వరుసలో నిలిచినట్టు చెప్పారు. అలాగే, ఆరు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు తొలి డోసు పంపిణీ 100శాతం పూర్తి చేశాయన్నారు. లక్షద్వీప్‌, చండీగఢ్‌, గోవా, హిమాచల్‌ ప్రదేశ్‌, అండమాన్‌ నికోబార్‌ దీవులు, సిక్కింలు ఈ జాబితాలో ఉన్నాయన్నారు.