అమృత్‌సర్‌లో పర్యటిస్తున్న జీహెచ్‌ఎంసీ బృందం
అమృత్‌సర్, నవంబర్ 18(జనంసాక్షి) : అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయం పరిసర ప్రాంతాలలో చేపట్టిన అభివృద్ది నమూనాను పరిశీలించడానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలోని జీహెచ్‌ఎంసీ ప్రతినిధి బృందం శనివారం పంజాబ్ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. మేయర్ రామ్మోహన్‌తో పాటు కమిషనర్ జనార్దన్ రెడ్డి, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, ఎమ్మెల్యేలు పాషాఖాద్రీ, అహ్మద్ బిన్ బలాల, చీఫ్ ఇంజనీర్ శ్రీధర్, సౌత్ జోన్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, సిసిపి శ్రీనివాసరావు, ఎస్.సి దత్తుపంతు తదితరులతో కూడిన ప్రతినిధి బృందం అమృత్‌సర్‌లో పర్యటించింది. 160కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అమృత్‌సర్ నగర పరివర్తన ప్రాజెక్ట్ అమలును స్వయంగా పరిశీలించారు. ఇదే నమూనాలో చార్మినార్ పరిసర ప్రాంతాలను అభివృద్ది చేయడానికి అద్యయనం కోసం అమృత్‌సర్ వెళ్లాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు సూచన మేరకు రెండు రోజుల పాటు మేయర్ రామ్మోహన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం అమృత్‌సర్‌లో పర్యటిస్తున్నారు. పంజాబ్ పర్యాటక, వారసత్వ పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా స్వర్ణదేవాలయం చుట్టూ పాత్‌వేల అభివృద్ది, ఒకే మాదిరిగా ఉన్న దుకాణాలు, స్టీట్ర్ ఫర్నీచర్, వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలను ఈ ప్రతినిధి బృందం పరిశీలించింది. రేపు అమృత్‌సర్ అభివృద్దిపై సంబంధిత అధికారులతో సమావేశం కానున్నారు.