హుజూరాబాద్‌ ఎన్నిక ఆలస్యం అయితే?


తమకే లాభం అని లెక్కలేసుకుంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు
త్వరగా జరిగితేనే మంచిదన్న భావనలో బిజెపి
కొండా సురేఖ రాకతో త్రిముఖ పోటీ తప్పదన్న అంచనా
హుజూరారాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఎంత ఆలస్యమైతే తమ విజయావ కాశాలు అంత మెరుగుపడతాయని టీఆర్‌ఎస్‌ స్థానికనేతలు అంచనా వేస్తున్నారు. దళితబంధు అమలు కావడానికి కొన్నిరోజుల సమయం పట్టవచ్చు. ఈలోగా పథకాలన్నీ పట్టాలకెక్కించాలని వారంతా కోరు కుంటున్నారు. మరోవైపు ఉపఎన్నిక త్వరగా జరగాలని ఈటలతో పాటు బీజేపీ నాయకులు కోరుకుం టున్నారు. ఇదే విషయాన్ని వారు కేంద్ర మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకువెళ్లారని సమాచారం. హుజూరా బాద్‌కు ఎన్నిక జరపడం అన్నది ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. ఆలస్యం అయితే హుజూరాబాద్‌లో
గెలుపుపై బీజేపీ నాయకులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు చల్లినట్టవుతుంది. ఈ ఉపఎన్నిక ముఖ్యమంత్రి కేసీఆర్‌ దక్షతకు,ప్రతిష్టకు సవాల్‌గా మారింది. కెసార్‌ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తుందని బిజెపి, కాంగ్రెస్‌ నేతల నుంచి సమాధానం వస్తోంది. అందుబాటులో ఉన్న అన్ని అస్త్రాలనూ ప్రయోగించినప్పటికీ హుజూరాబాద్‌లో ఓడిపోతే కేసీఆర్‌కు రాజకీయంగా శరాఘాతమే అవుతుంది. అదే జరిగితే పార్టీ పైనా, ప్రభుత్వంపైనా ఆయన పట్టు సడలుతుంది. పార్టీ తరఫున చతురంగ దళాలను రంగంలోకి దించడంతో పాటు మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మోహరించినా ఫలితం లేకపోతే కేసీఆర్‌కు అంతకు మించిన అవమానం ఉండదని అంచనా వేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పదన్న అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. దుబ్బాక తరహాలో స్వల్ప మెజార్టీతో గెల్చినా పర్వాలేదన్న ధీమాలో బిజెపి ఉంది. అలాగే కాంగ్రెస్‌ నుంచి కొండా సురేఖను రంగంఓలకి దింపుతున్నారు. దీంతో పోటీ రసవత్తరం కానుంది. ఇక్కడ త్రిముఖ పోటీ తప్పేలా లేదు. గెల్లు శ్రీనివాసయాదవ్‌, ఈటెల రాజేందర్‌, కొండా సురేఖలు ముగ్గురూ గట్టి అభ్యర్థులు కావడంతో విజయం అంచనావేయడంకష్టమే. ఏకపక్షంగా ఉంటుందని భావించడానికి లేదు. ఈ కారణంగానే ఎలాగైనా హుజూరాబాద్‌లో గెలిచి తన అధికారాన్ని పదిల పరచు కోవాలని కేసీఆర్‌ ఈ ఎన్నికలను అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. అయితే ఆయన ఇందుకోసం రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. ప్రభుత్వ డబ్బుతో పథకాల పేరున ఓటర్లను ఆకట్టుకునేలా మాస్టర్‌ ప్లాన్‌ వేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ చర్యల వల్ల ప్రజల్లో ఆశలు రెట్టింపు అవుతున్నాయి. తమ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్‌ఏదడిగినా ఇస్తుందన్న భరోసా ఏర్పడిరది. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు, మంత్రులు, శాసనసభ్యులూ తలలు పట్టుకుంటున్నారు. హుజూరాబాద్‌ కారణంగా తమ నియోజకవర్గం ప్రజల నుంచి తమకు కూడా అవన్నీ కావాలని ఒత్తిడి వస్తోందని నేతలు వాపోతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్‌ వేసిన రాజకీయ ఎత్తుగడలకు తిరుగుండేది కాదు. ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించడం లేదని విపక్షాల్లో చర్చమొదలయ్యింది. గతంలో ఏ ఎన్నిక జరిగినా ఆడుతూ పాడుతూ గెలుచుకుంటూ వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతి ఎన్నికలో విజయం కోసం చెమటోడ్చాల్సి వస్తోంది. అలాగే ఇప్పటివరకు కేసీఆర్‌ తన వాగ్దాటితో తెలంగాణ ప్రజలను కట్టిపడేసేవారు. ప్రతి ఎన్నికల్లో ధనబలంతో గెలిచి పరువు నిలబెట్టుకున్నారు. అదే సమయంలో తెలంగాణలో ప్రతిపక్షాలు క్రియాశీలం అయ్యాయి. నిన్నటివరకు బీజేపీ మాత్రమే ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ వచ్చింది. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా రేవంత్‌ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్‌ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన దళిత, ఆదివాసీ దండోరా విజయవంతమైంది. పీసీసీ చేపడుతున్న ఇతర కార్యక్రమాలు కూడా సక్సెస్‌ అవుతున్నాయి. మొత్తం విూద తెలంగాణలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉందన్న నమ్మకం కల్పించడంలో రేవంత్‌రెడ్డి కృతకృత్యులయ్యారు. అంత మాత్రాన రేవంత్‌ రెడ్డి మహా నాయకుడు అని భావించడానికి లేదు. యువతో మాత్రం జోష్‌ నింపగలుగుతున్నారు. కేసీఆర్‌కు గట్టిగా ఎదురునిలిచి ప్రతిఘటించే నేతగా ప్రజల దృష్టికి ఆకర్శిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా యువత ఆయనవైపు చూస్తోంది. నిన్నటివరకు కాంగ్రెస్‌లో స్తబ్దత ఉండటంతో పాటు, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్‌ వంటి వారు కేసీఆర్‌ను ధాటిగా ఎదుర్కోవడంతో ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యాక కేసీఆర్‌కు మరో తలనొప్పిలా తయారయ్యడన్న అభిప్రాయం కాంగ్రెస్‌ శ్రేణుల్లోనే
కాకుండా ప్రజల్లో కూడా ఏర్పడిరది. ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు సమ ఉజ్జీలుగా కేసీఆర్‌తో తలపడుతున్నాయి. ఈ పరిణామం తమకు మేలు చేస్తుందని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు రెండు పార్టీల మధ్య చీలిపోయి తమకు లాభిస్తుందని టిఆర్‌ఎస్‌ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తానికి హుజూరాబాద్‌ పోటీ ఎవరికీ అంత ఈజీ కాదని గుర్తుంచుకోవాలి. బిజెపికి కూడా అంత సుభలం కాకపోవచ్చు.