హైదరాబాద్‌లో మహాప్రస్థానాలకు మహర్దశ…

Women-Corporators-turn-dummy-in-GHMCహైదరాబాద్ : జిహెచ్‌ఎంసి మహాప్రస్థానాలకు మహర్దశ పట్టనుంది. స్మశానాల్లో ఉండే భయానక వాతావరణాన్ని తొలగించి సుందరంగా మార్చేందుకు బల్దియా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్‌ గ్రేవ్‌ యార్డ్‌ పట్ల మంచి స్పందన రావడంతో అదే పద్ధతిలో మిగతా వాటినీ అభివృద్ధి చేయాలని కార్పోరేషన్‌ ప్లాన్ చేస్తోంది. అస్తవ్యస్తంగా ఉండే మహాప్రస్థానాలు ఇకముందు అసౌకర్యంగా ఉండకూడదు. ఆప్తులను చివరిసారిగా చూసేందుకు వచ్చేవారు ఇబ్బందులు పడకూడదు.. ఇలాంటి లక్ష్యాలతో గ్రేవ్‌ యార్డ్స్‌లో మౌలిక వసతుల రూపకల్పనకు గ్రేటర్‌ హైదరాబాద్‌ రంగం సిద్ధం చేస్తోంది.

ప్రహరీలకు నోచుకోని స్మశానాలు
రోజురోజుకూ విస్తరిస్తూ పోతున్న హైద‌రాబాద్‌లో చివరకు చాలా స్మశానాలు కుచించుకుపోయాయి. ఉన్నవాటిల్లో సౌక‌ర్యాలు శూన్యమైపోతున్నాయి. దీంతో అంత్యక్రియల వేళ త‌మ ఆప్తుల‌ను చివ‌రిసారిగా చూసుకోవ‌డానికి వ‌చ్చేవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని స్మశాన వాటికల్లో ప్రహరీలు సరిగ్గా లేక దహన సంస్కారాలు రోడ్లపై వెళ్లేవారికి కనిపిస్తున్న సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వాటిని పునరుద్ధరించేందుకు యంత్రాంగం కదిలింది.

కబ్జాకు గురైన 960 స్మశానాలు …
గ్రేట‌ర్ హైదరాబాద్ ప‌రిధిలో చిన్నాపెద్దా కలిపి మొత్తం 960 దాకా స్మశాన వాటికలున్నాయి. ఇవిగాక చాలా వాటికలు కబ్జాకు గురయ్యాయి. ఇదిలా ఉంటే పంజాగుట్ట, అంబ‌ర్‌పేట లాంటి పెద్ద పెద్ద గ్రేవ్‌ యార్డ్స్‌లో ఎల‌క్ట్రిక‌ల్ స్మశాన వాటిక‌ల‌ను ఏర్పాటు చేసినా వాటిని ప్రారంభించ లేదు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి చేసిన నిర్మాణాలు, వాటిల్లోని యంత్రాలు నిరుప‌యోగంగా మారాయి.

స్మశానాలఆధునీకరణ…
ఇలాంటి నేపథ్యంలో స్మశాన వాటికలను మోడ్రనైజ్‌ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని జిహెచ్ఎంసి మేయ‌ర్ బొంతురామ్మోహ‌న్ అన్నారు. ముందుగా పంజాగుట్ట, అమీర్‌పేట్, మూసాపేట్, బ‌ల్కంపేట్, మారేడుప‌ల్లి, నాగోల్, అంబ‌ర్‌పేట్ ప్రాంతాల్లోని స్మశాన వాటిక‌ల‌ను మోడ‌ల్ గ్రేవ్ యార్డులుగా అబివృద్ధి చేసేందుకు చ‌ర్యలు తీసుకుంటున్నామన్నారు. అయితే స్మశాన వాటిక‌లను అభివృద్ధి చేయడం అనంతరం వాటిని ప్రైవేట్‌ వ్యక్తుల‌కు అప్పజెబుతారనే వాద‌న‌లు స‌రికావంటోంది బ‌ల్దియా. మొత్తమ్మీద హైదరాబాద్‌లో మహాప్రస్థానాలకు మహర్దశ పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.