హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా ప్రసిద్ధి గాంచినది : సీఎం

హైదరాబాద్‌ : సమాచార సాంకేతిక విజ్ఞానం, వైద్యరంగంలో రాష్ట్రం మరింత విస్తరించడానికి హైదరాబాద్‌ డిక్లరేషన్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఐటీ ద్వారా వైద్యరంగంలో మార్పులు అనే అంశంపై అపోలో ఆసుపత్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇప్పటికే దేశంలో హైదరాబాద్‌ హెల్త్‌ హబ్‌గా ప్రసిద్ధి గాంచిందని మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, సమాచార విప్లవాన్ని మరింత ఉపయోగించుకోగలిగితే ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఖాయమన్నారు. ఇంటర్నెట్‌, ఆన్‌లైన్‌ ద్వారా వైద్యసేవలను మెరుగుపరచడం ఎలా అనే అంశంపై రూపొందించిన హైదరాబాద్‌ డిక్లరేషన్‌పై ముఖ్యమంత్రి సంతకం చేశారు. అపోలో ఆసుపత్రుల చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌ డిక్లరేషన్‌ ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయమన్నారు. ఈ సదస్సులో దేశ విదేశాలకు చెందిన వైద్యులు, ఐటీ నిపుణులు పాల్గొన్నారు.