అంగన్వాడి, పాఠశాలల విద్యార్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. -జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్ బ్యూరో-జూలై15(జనంసాక్షి)
అంగన్వాడి, పాఠశాలల విద్యార్ధుల బాగుకోసం జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక తెలిపారు. శుక్రవారం కలక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ కె. శశాంక విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్, పాఠశాలలు, అంగన్వాడి లలో పిల్లల బాగుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వర్షాలు తగ్గిన తర్వాత పిల్లలు పాఠశాలలకు తిరిగి వచ్చే క్రమంలో పాఠశాలల, అంగన్వాడి ఆవరణలో నీరు నిల్వ లేకుండా, గోడలు తడి ఉన్న వాటిపై జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ ఏర్పాట్లను ముందస్తుగా ఎటువంటి ఇబ్బందులూ ఏర్పడకుండా ఉండే విధంగా పరిశీలించాలని, స్థానిక సర్పంచులు, కౌన్సిలర్, అధికారులతో మాట్లాడి వాటర్ స్టాగ్నేషన్, శానిటేషన్ పై చర్యలు తీసుకోవాలని, జ్వరంతో పిల్లలు పాఠశాలకు దూరం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మధ్యాహ్న భోజన సమయంలో అందించే వంట వండే క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలని, ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు పడినందున శిధిలావస్థలో ఉన్న, పాడైపోయిన గదులలో పిల్లలను కూర్చో బెట్టరాదని, విద్యుత్ ప్రమాదాలు జరిగి జిల్లాలో 19 పశు సంపదను కోల్పోయామని, గోడలలో విద్యుత్ ప్రసారం అయ్యే వాటికి దూరంగా ఉండాలని, పిల్లల బాగుకోసం జాగ్రత్తలు వహించాలని తెలిపారు. పిల్లలు శుద్ధమైన నీటిని తాగే విధంగా చూడాలని, మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండాలని, కూరగాయలను ఎప్పటికప్పుడు తెప్పించుకొని శుభ్రంగా కడిగి వండాలని, కిచెన్ పరిసరాలు శుభ్రంగా ఉండాలని, టాయ్లెట్ లు శుబ్రం గా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని, పాఠశాలలు, అంగన్వాడి సెంటర్ లలో ప్రతిరోజు పిల్లల, టీచర్ ల హాజరు వివరాలను పంపాలని, యూనిఫాం స్టిచింగ్ క్వాలిటీగా ఉండే విధంగా పరిశీలించాలని, త్వరగా అందించుటకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే పలుమార్లు చెప్పడం జరిగిందని, వెంటనే ఏర్పాటు చేయలని ఆదేశించారు. పిల్లలు బయట కనపడితే సి.ఆర్.పి. లపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని, 8, 9, 10 వ తరగతిలో చాలా కాలంగా హాజరు కాని వారు ఎందుకు హాజరు కాలేకపోయారు అని, ఇప్పుడు వారు వస్తున్నారా పరిశీలించాలని అన్నారు. పాఠశాలకు సంబంధించిన ఫెయిల్ అయిన విద్యార్ధులను పిలిచి ప్రత్యేక తరగతులు నిర్వహించే విధంగా చూడాలని తెలిపారు. ఇంటింటా ఇన్నోవేటర్ లో పాల్గొనే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలని తెలిపారు. అంగన్వాడి సెంటర్ లలో చివరి 100 లో వున్న వారు పని తీరు మెరుగు పరుచుకోకుండా ఉన్న వారిని గుర్తించాలని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎండి అబ్దుల్ హై, డిడబ్ల్యూఓ నర్మద, సి.డి.పి. ఓలు, మండల విద్యా అధికారులు, నోడల్ ప్రధాన ఉపాద్యాయులు, సమగ్ర శిక్ష కో ఆర్డినేటర్ లు, సి.ఆర్.పి.లు, అంగన్వాడీ సూపర్వైజర్ లు, తదితరులు పాల్గొననున్నారు.