అంగన్వాడీ ల ద్వారా మెరుగైన సేవలు అందాలి
అధికారులు క్షేత్ర స్థాయి తనిఖీలు చేపట్టాలి
తీవ్ర పోషణ లోపంతో ఉన్న పిల్లలకు మెరుగైన వైద్యం అందాలి
నిర్లక్ష్యంపై చర్యలు తప్పవు
– జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన సేవలు అందాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తో పోషణ అభియాన్ జిల్లా స్థాయి కన్వర్జెన్స్ సమావేశం నిర్వహణతో పాటు పోషణ మాసం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల విధిగా అంగన్వాడీ కేంద్రాలలో నమోదైన పిల్లల ఎత్తు, బరువులు తీసి తద్వారా పోషణ లోపం,తీవ్ర పోషణ లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందించడంతో పాటు వైద్య శాఖ సిబ్బంది సమన్వయంతో వైద్య పరీక్షలు చేపట్టి పిల్లలు సాధారణ స్థితికి వచ్చే విదంగా కృషి చేయాలని సూచించారు.అధికారులు,సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని పోషణలోప రహిత జిల్లాగా ముందుంచాలన్నారు.జిల్లాలో ప్రతి సవంత్సరం సెప్టెంబర్ మాసం పోషణ మాసంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా పిల్లల ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ, రక్తహీనత నివారణ, అంగన్వాడి కేంద్రాలలో పెరటి తోట పెంపకాలపై క్షేత్ర స్థాయిలో సిబ్బంది అందరూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకోవాలని, పిల్లల ఎత్తు బరువులు తీసి ఆన్లైన్ పద్ధతిలో నమోదు చేసే క్రమంలో జిల్లాలో అంగన్వాడీ టీచర్లు అవగాహన లోపం వలన తప్పుగా నమోదు చేయడంతో సాధారణ స్థితిలో ఉన్న పిల్లలు కూడ పోషణ లోపంతో ఉన్నట్లు నివేదిక చూపుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని,లేని యెడల ఉపేక్షించేది లేదని తదుపరి శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ సేవలు మరింత విస్తృతపరిచి పోషణ లోప నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ , డిఎంహెచ్ఓ కోటాచలం , జిల్లా వ్యవసాయశాఖా అధికారి రామారావు నాయక్, పోషణ అభియాన్ జిల్లా సమన్వయకర్త పి.సంపత్, సిడిపివోలు విజయలక్ష్మి , శ్రీజ , సాయి గీత , అనంతలక్ష్మి , రూప , జిల్లా పోషణ అభియాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.