అంగన్ వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం
గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు మేలు చేసేలా చర్యలు
మంత్రి పరిటాల సునీత వెల్లడి
విజయవాడ,జూలై13(జనం సాక్షి): అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు అన్న అమృత హస్తం, బాలామృతం పధకాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, రాజీవ్ నగర్ 58 వ డివిజన్ లోని అంగన్ వాడీ ప్రీ స్కూల్ ను స్ధానిక ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు తో కలిసి మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. అంగన్ వాడీ కేంద్రంలోని తరగతి గదులు, వంట శాలను మంత్రి పరిశీలించారు. పిల్లలతో రైమ్స్ చెప్పిస్తూ కాసేపు సరదాగా మంత్రి గడిపారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని ఏవిధంగా వండుతున్నారు, నాణ్యత ఎలా ఉందని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్ వాడీ ప్రీ స్కూల్స్ ద్వారా కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా చక్కటి వాతావరణంలో చిన్నారులకు ఇంగ్లీష్ విూడియంలో చదువు నేర్పిస్తున్నా మన్నారు. ముఖ్యమంత్రి గారి చొరవతో అంగన్ వాడీ సెంటర్లను సమూలంగా చేయడం జరిగిందన్నారు. అంగన్ వాడీల కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో రెండు సార్లు వేతనాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందన్నారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని చిన్నారులు, గర్భిణీ, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ కార్యకర్తలు కూడ వారి పరిధిలో ఉన్న గర్భిణీ, బాలింతలను గుర్తించి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. కృష్ణా జిల్లాలో అంగన్ వాడీ కేంద్రాలలో జిల్లా కలెక్టర్ మరియు స్ధానిక నాయకుల సహకారంతో రాగిలడ్డు, సజ్జలడ్డు ఇలా ప్రత్యేక పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. అంగన్ వాడీ కేంద్రాల పరిధిలో వర్షం నీరు నిల్వ ఉండకుండా, పరిసరాలు కూడ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వారికి సూచించారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గం, 54 వ డివిజన్ లోని గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో కుట్టు మిషన్ల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు. మెప్మా ఆద్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 50 మంది మహిళలకు ఎమ్మెల్యే బోండా ఉమ గారితో కలిసి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పేద మహిళలకు జీవనోపాధిని కల్పించి, ఆర్ధిక బరోసానిచ్చేందుకు ప్రభుత్వం అనేక పధకాలను మహిళల కోసం ప్రవేశపెట్టిందని మంత్రి అన్నారు. ప్రతి మహిళ కు నెలకు పది వేల ఆదాయం వచ్చేలా అనేక కార్యక్రమాలను చేపట్టిందన్నారు. పేదలకు న్యాయం చేసిన ప్రభుత్వం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. 200,500 ఉన్న పెన్షన్ ను 1000, 1500 చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదేనన్నారు. హిజ్రాలు, ఒంటరి మహిళలను కూడ గుర్తించి పెన్షన్ ఇస్తున్నామన్నారు. బయోమెట్రిక్ ను ప్రవేశపెట్టి పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం జరుగుతుందన్నారు. ఆడపిల్లల పెళ్ళి కుటుంబానికి బారం
కాకూడదనే ఉద్దేశంతో చంద్రన్న పెళ్లి కానుకను అందిస్తున్నామన్నారు. వికలాంగులు పెళ్లి చేసుకుంటే వారికి లక్ష రూపాయలు సాయం ప్రభుత్వం అందిస్తుందన్నారు. చంద్రన్న భీమా ద్వారా ప్రమాదంలో చనిపోయిన వారికి ఐదు లక్షలు అందించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను శ్రీరాములు, విద్యానాధ్ కు మంత్రి చేతుల విూదుగా అందజేశారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గం, గాంధీనగర్, అలంకార్ సెంటర్ లోని అన్న క్యాంటీన్ ను మంత్రి సందర్శించారు. భోజనం చేసేందుకు వచ్చిన వారికి మంత్రి స్వయంగా వడ్డించారు. ప్రజలతో కలిసి అన్న క్యాంటీన్ లో మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే బోండా ఉమా భోజనం చేశారు. అన్నా క్యాంటీన్ల పై ప్రజల్లో వచ్చిన స్పందన చూసి భోజనం చేసేందుకు ఇక్కడికి వచ్చామని మంత్రి అన్నారు. రుచికరమైన భోజనం రూ.5 కే అందజేయడంతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు.