అంతా ఆన్‌లైన్‌ చేశాం..

– అందుకే లక్ష్యం లక్షలు దాటింది

– లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారు

– డిసెంబర్‌ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తాం

– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

అనంతపురం, నవంబర్‌23(జ‌నంసాక్షి) : దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని అతి పెద్ద నిరుద్యోగ భృతి కార్యక్రమంగా ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ రికార్డు సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.

శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన కప్పలబండ గ్రామదర్శినిలో పాల్గొని ప్రసంగించారు. ఒక్క క్లిక్‌ తో సంక్షేమ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగానే అర్హులా, కాదా అని అప్పటికప్పుడే చెప్పే విధానం దేశంలో కేవలం ఒక్క ముఖ్యమంత్రి యువనేస్తంలో మాత్రమే ఉందని అన్నారు. గతంలో అనేక రాష్ట్రాలు కార్యక్రమాన్ని ప్రారంభించినా సరైన సమాచార అనుసంధానం, శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, పారదర్శకత పాటించకపోవడంతో ఈ కార్యక్రమాన్ని మధ్యలోనే ఆపేశాయని ముఖ్యమంత్రి అన్నారు. ఆంధప్రదేశ్‌లో ఈ కార్యక్రమం అమలులో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని, ఫలితంగా ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 4 లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారని, వీరందరికీ డిసెంబర్‌ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తామని చంద్రబాబు తెలిపారు. పైరవీలు, సిఫారసులు అనే మాట లేకుండా అంతా ఆన్‌లైన్‌ చేశామని, అందుకే లక్ష్యం లక్షలు దాటిందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. నిరుద్యోగభృతి అందుకుంటూనే, వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన యువత ఆంధప్రదేశ్‌ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం కానుందని చంద్రబాబు తన ధీమా వ్యక్తం చేశారు. కరువు జిల్లాలో కియా కారు రానుందని, జనవరిలో కియా కారు రాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. హంద్రినీవా నీటితోనే సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 36 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పెళ్లి రోజునే చంద్రన్న పెళ్లి కానుక అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడితో 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం యువనేస్తం కింద నిరుద్యోగులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తున్నామని, మైక్రో ఇరిగేషన్‌తో నీటి పొదుపు సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.