వరంగల్ మార్కెట్లో సిసిఐ కొనుగోలు చేపట్టక పడిగాపులు కాస్తున్న రైతన్నలు

తేమ పేరుతో పత్తి రైతులకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) చుక్కలు చూపిస్తున్నది. పత్తి కొనుగోళ్లు ప్రారంభించి 20 రోజులు గడుస్తున్నా… ఇప్పటివరకు 24 జిల్లాల్లో ఒక్క దూది పింజ కూడా కొనుగోలు చేయలేదు. తేమ శాతం పేరుతో కొర్రీలు పెడుతూ రైతుల నుంచి పత్తి కొనుగోలుకు నిరాకరిస్తున్నది. ‘పరిస్థితులు, వాతావరణంతో మాకు సంబంధం లేదు.. నిబంధనల ప్రకారం ఉంటేనే కొనుగోలు చేస్తాం లేదంటే చేయం’ అని కరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ విధంగా పత్తి రైతులను గోస పెడుతున్న సీసీఐ ఆగడాలను నిలువరించాల్సిన మార్కెటింగ్‌ శాఖ, ప్రభుత్వం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆరు జిల్లాల్లోనే కొనుగోలు
మార్కెటింగ్‌ శాఖ మొత్తం 322 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించగా, 20 రోజుల్లో 280 కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది. ఇప్పటివరకు ఏకంగా 24 జిల్లాల్లో ఒక్క దూదిపింజ కూడా కొనుగోలు చేయలేదు. 6 జిల్లాల్లో మాత్రమే నామమాత్రంగా కొనుగోలు చేసింది. ఇందులోనూ కరీంనగర్‌ జిల్లాలో ఆరుగురు(6) రైతుల నుంచి 6.5 టన్నుల పత్తి కొనుగోలు చేయగా, వికారాబాద్‌ జిల్లాలో 8మంది రైతుల నుంచి 11టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. ఈ నెల 24వరకు ఆరు జిల్లాల్లో మొత్తం 124 మంది రైతుల నుంచి రూ. 15 కోట్ల విలువైన 209 టన్నుల పత్తిని కొనుగోలు చేసింది. ఈ లెక్కన ఒక్కో రైతు నుంచి సగటున 1.68 టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. ఇక ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా కొనుగోలు డబ్బులు చెల్లించలేదు.

తేమ పేరుతో చుక్కలు
ఈ సీజన్‌లో పత్తి రైతులకు మార్కెటింగ్‌ శాఖ, సీసీఐ రూపంలో చుక్కలు కనిపిస్తున్నాయి. మార్కెటింగ్‌ శాఖ అడగదు.. సీసీఐ ఇవ్వదు వెరసి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా తేమ పేరుతో రైతులను పెడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సీసీఐ నిబంధనల ప్రకారం 8-12శాతం పత్తి ఉండాలి. అలా అయితే సీసీఐ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసి మద్దతు ధర ఇస్తుంది. కానీ వాతావరణ పరిస్థితులు బాగాలేకపోవడం, వర్షాలతో ప్రస్తుతం పత్తిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ ఏ మాత్రం వెసులుబాటు ఇవ్వకుండా నిబంధనల మేరకు తేమ శాతం ఉండాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. 12శాతం లోపు ఉంటే కొనుగోలు చేస్తాం లేకుండా చేయబోం అంటూ స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు మార్కెట్‌కు తీసుకొచ్చిన పంటను తిరిగి తీసుకెళ్తున్నారు. సరే ఆరబెట్టి మళ్లీ సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకొద్దామని భావించినా… తుఫాను హెచ్చరికలు, ఎప్పుడు కురుస్తుందో తెలియని వర్షంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. తీరా వర్షం కురిస్తే అసలుకే మోసం వస్తుందని భయపడి తక్కువ ధరకే ప్రైవేటు వ్యాపారులకు కట్టబెడుతున్నారు. ఈ విధంగా పత్తి రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం, మార్కెటింగ్‌ శాఖ పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పత్తి కొనుగోలు చేయని జిల్లాలు..
ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హన్మకొండ , భూపాలపల్లి, గద్వాల్‌, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఆసీఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మెదక్‌, ములుగు, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నిర్మల్‌, పెద్దపల్లి, రంగారెడ్డి , సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వనపర్తి, భువనగిరి.

దిగుబడి రాక పత్తిరైతు లబోదిబో
మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం రాములుతండాకు చెందిన రైతు జాటోత్‌ సురేశ్‌ ఆరుగాలం కష్టపడి పత్తి సాగు చేస్తే పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. ఎకరానికి కేవలం 2-3 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దీనికితోడు సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి ఎర్రబారి తీవ్ర నష్టం జరగడంతో మార్కెట్లో ధర తక్కువగా ఉంది. ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెడితే రూ.15 వేలు కూడా వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. రెండున్నర ఎకరాలు పత్తి సాగు చేయగా ఇందులో ఎకరంన్నర కౌలుకు తీసుకున్నాడు. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాల్లో 5 క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చింది. చేను ఎండిపోతుండటంతో ఆదివారం రోటవేటర్‌తో ఎకరంన్నర పత్తి దున్నేశాడు.