అంత‌రిక్షంలో చైనా వ్యోమ‌గాములు

spaceబీజింగ్‌: తొలిసారి ఏదైనా అంద‌మైన‌ ప్ర‌దేశానికి వెళ్తే మ‌న నోట మాట రాదు. ఆశ్చ‌ర్యంతో అలా కాసేపు చూస్తూ ఉండిపోతాం. అలాంటిది భూవాతావ‌ర‌ణాన్ని వ‌దిలి ఏకంగా అంత‌రిక్షానికే వెళ్తే మ‌న ఫీలింగ్ ఎలా ఉంటుంది. అచ్చూ ఈ చైనా ఆస్ట్రోనాట్‌లాగే ఉంటుంది. సోమవారం చైనా ప్ర‌యోగించిన మాన‌వ స‌హిత షెంజో-11 స్పేస్‌క్రాఫ్ట్‌లో తొలిసారి అంత‌రిక్షానికి వెళ్లిన చెన్ డాంగ్‌కు కూడా.. అక్క‌డి అందాన్ని చూసి నోట మాట రాలేద‌ట‌. త‌న స‌హ‌చ‌రుడు, మూడోసారి అంత‌రిక్షానికి వెళ్లిన జింగ్ హైపెంగ్ ప‌దేప‌దే పిలిస్తేగానీ అత‌డు ప‌ల‌క‌లేద‌ట‌. అంత‌లా ఆశ్చ‌ర్య‌పోయాడు చెన్ డాంగ్‌. అంత‌రిక్షానికి వెళ్లిన త‌ర్వాత ఈ ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ‌ను చైనా అధికారిక చానెల్ జినువా న్యూస్‌ రిలీజ్ చేసింది.

అంత‌రిక్షాన్ని చూడ‌గానే అద్భుతం అంటూ చెన్ అన‌డం.. కూల్ క‌దా అని జింగ్ చెప్ప‌డం ఆ ఆడియోలో వినిపించింది. ఈ ఇద్ద‌రు టైకోనాట్లు (ఆస్ట్రోనాట్లు) చైనా అత్యంత సుదీర్ఘ‌మైన‌ మాన‌వ స‌హిత స్పేస్‌క్రాఫ్ట్ మిష‌న్‌లో భాగంగా అంత‌రిక్షానికి వెళ్లారు. అక్క‌డున్న టియాంగాంగ్‌-2 స్పేస్‌స్టేష‌న్‌లో వీళ్లు 30 రోజుల పాటు ఉండ‌నున్నారు. చైనీస్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైట‌ర్ పైల‌ట్ అయిన‌ జింగ్ హైపెంగ్ తొలిసారి 1998లో అంత‌రిక్షానికి వెళ్లారు. చైనాలో అత్యంత అనుభ‌వ‌జ్ఞుడైన టైకోనాట్ ఇత‌డే. చైనా చేసిన ఆరు మాన‌వ స‌హిత స్పేస్‌క్రాఫ్ట్ మిష‌న్ల‌లో మూడుసార్లు హైపెంగ్ ఉన్నారు.