అందరికీ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

సామాన్యుల చెంతకు వైద్యం చేర్చే ప్రయత్నం : మంత్రి
విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్య రక్ష పథకానికి శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ అన్నారు. ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు ఈ బృహత్తర పథకం ప్రవేశ పెట్టామని అన్నారు. ఈ పథకంతో ప్రజలు ఆరోగ్యంతో ఆనందంగా జీవించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో సంపదతోపాటు ఆరోగ్యంగా కూడా ఉండాలని, ఆరోగ్యం చాలా ప్రధాన మైన అంశమని మంత్రి అన్నారు. ఈ ఆలోచనతోనే అందరికీ ఆరోగ్య పథకాన్ని సిఎం చంద్రబాబు  ప్రారంభించారని అన్నారు. దేశంలో ప్రజారోగ్యం కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని అన్నారు. సామాన్యులకు వైద్యం వారి చెంతకు రానుందన్నారు. ఆరోగ్య రక్ష హెల్త్‌ కార్డుకు నెలకు రూ.100 చొప్పున సంవత్సరానికి రూ.1,200 చెల్లిస్తే రూ.2 లక్షల వరకు వైద్య సేవలు పొందవచ్చన్నారు. వ్యవసాయంతో పాటు ఆరోగ్యంపై కూడా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారని, వీటి నుంచి విముక్తి కల్పించేందుకే ఆరోగ్య రక్ష పథకాన్ని రూపొందించామన్నారు. రాష్ట్రంలోని 436 ఆసుపత్రుల్లో ఆరోగ్యరక్ష కింద వైద్యం చేయించుకునే వీలుందని, వీటిలో 80 ప్రభుత్వ ఆసపత్రులున్నాయని తెలిపారు. నచ్చిన వైద్యుడితో వైద్యం చేయించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో దారిద్య రేఖకు ఎగువన ఉన్న 34 లక్షల కుటుంబాలు లక్ష్యంగా పథకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. ఆధార్‌ నంబర్‌తో ఫిబ్రవరి 28 వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయించుకోవచ్చన్నారు. ఈసంవత్సరం అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు. తొలుత ఈ పథకానికి రూ.100 కోట్ల బడ్జెట్‌ కేటాయించమని, అవసరమైతే పెంచుతామని సిఎం హావిూ ఇచ్చారని వెల్లడించారు. ఆరోగ్యంపై ఎంత ఖర్చు చేస్తే అంతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఆకాంక్షించి ఈ బృహత్తర పథకాన్ని ప్రారంభించారని అన్నారు. ఆరోగ్య రక్ష కింద అందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. త్వరలో  కొత్త అర్బన్‌ సెంటర్లను ప్రారంభించ నున్నామన్నారు.