అంబరాన్నంటిన భోగి సంబురాలు 

– ఆనందోత్సాహాలతో భోగి వేడుకల్లో పాల్గొన్న ప్రజలు
– అర్థరాత్రి నుంచే పల్లెలు, పట్టణాల్లో భోగి మంటలు
– నారావారిపల్లెలలో భోగివేడుకల్లో పాల్గొన్న లోకేశ్‌, బ్రాహ్మిణి
– విజయవాడలో భోగి వేడుకల్లో మంత్రి దేవినేని
– ఇళ్ల ముందు కనువిందు చేస్తున్న రంగవల్లులు
అమరావతి, జనవరి14(జ‌నంసాక్షి) : సంక్రాంతి పండగ సందర్భంగా తెలుగు లోగిళ్లు సందడిగా మారాయి. పల్లెల్లో తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు కనువిందు చేస్తున్నాయి. భోగి మంటలు వేసి ఆనందోత్సాహలతో వేడుకలు జరుపుకొంటున్నారు. విజయవాడలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. భోగిని పురస్కరించుకుని పలుచోట్ల తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. అంతా కలిసి భోగి మంటల వెలుగుల్లో సంక్రాంతికి స్వాగతం పలికారు. గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బృందావన్‌ గార్డెన్సులోని ఎన్టీఆర్‌ స్టేడియంలో భోగి మంటలు వేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్‌ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ విశిష్టతను చాటుతూ సంప్రదాయాలను గుర్తు చేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.  ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి శోభ సంతరించుకుంది. నగరంలో వాడవాడలా చిన్నాపెద్దా అందరూ కలిసి భోగి మంటలు వేశారు. మంత్రి సిద్ధ రాఘవరావు తన నివాసం వద్ద కుటుంబంతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేసి ఆనందోత్సాహాలతో నగరవాసులు వేడుకలు జరుపుకొంటున్నారు. సూర్యుడి కంటే ముందే భోగి మంటలు ప్రారంభమయ్యాయి. సిద్దార్థ పబ్లిక్‌ స్కూల్‌లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఎంపీ గంగరాజు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రావు పాల్గొన్నారు. భోగి సందర్భంగా సిద్దార్థ వాకర్స్‌ ఆధ్వర్యంలో మెగా పరుగు నిర్వహించారు. అలాగే గంగిరెద్దుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. బాహుబలి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
భోగి వేడుకల్లో పాల్గొన్న లోకేష్‌, బ్రాహ్మణి..
జిల్లాలోని నారావారిపల్లెలో జరిగిన సంక్రాంతి భోగి వేడుకల్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌, ఆయన సతీమణి బ్రాహ్మణి, వారి కుమారుడు దేవాన్ష్‌ పాల్గొన్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పర్వదినాన్ని తమ గ్రామమైన నారావారిపల్లెలో నారా వారి కుటుంబం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా ఒకరోజు ముందుగానే నారావారిపల్లెకు చేరుకున్న లోకేష్‌ కుటుంబ సభ్యులు సోమవారం తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. నారావారి పల్లె గ్రామస్తులు, కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ లోకేష్‌ సందడి చేశారు.
ఇదిలా ఉంటే  మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడిలో మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు భోగి పండుగను జరుపుకుంటున్నారు. భోగి మంటలు చుట్టూ మహిళలు ప్రదక్షిణలు చేస్తూ ఆట పాటలతో ఉత్సహంగా పాల్గొన్నారు. టీడీపీ నాయకులు తెలుగుదనం ఉట్టి పడేలా పూర్తి సాంప్రదాయబద్ధంగా వస్త్రాలు ధరించి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతీ ఏడాది గొల్లపూడి ప్రజలు సంక్రాంతి పండుగను
వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. భోగి అందరికీ భోగభాగ్యాలు కలిగించాలని కోరుతూ ఇంట్లోని పాత వస్తువులను భోగి మంటల్లో వేస్తామన్నారు. సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాలని అన్నివర్గాలు ప్రజలు భోగి పండుగలో భాగస్వాములయ్యారన్నారు. సంక్రాంతి అందరికీ మిక్కిలి ఆనందాన్ని కలిగించాలని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు వేడుకగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని మంత్రి దేవినేని అన్నారు. అదేవిధంగా  భీమరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భోగి మంటల వేసి ప్రజలు ఉత్సాహంగా పండుగ సంబరాల్లో గడుపుతున్నారు. ఉండి ఎమ్మెల్యే శివరామరాజు భోగి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ ప్రకృతికి సంబంధించిన పండుగ అని అన్నారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భీమవరానికి వచ్చి పండుగ సంబరాల్లో పాల్గొంటున్నారని తెలిపారు.
అదేవిధంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  తెనాలిలోని పెదరావూరులో భోగి వేడుకలు చేసుకున్నారు. పార్టీ నేతలు, అభిమానుల సమక్షంలో ఆయన స్వయంగా భోగి మంట వెలిగించారు. ఈ వేడుకల్లో జనసేన నేతలు నాదెండ్ల మనోహర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.