అక్టోబరు 11నుంచి గోఎయిర్‌ అంతర్జాతీయ సేవలు

– వెల్లడించిన సంస్థ సీఈఓ కార్నెలిస్‌ వీస్విజిక్‌
ముంబయి, ఆగస్టు30(జ‌నం సాక్షి) : ప్రముఖ బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ అంతర్జాతీయ విమాన సేవల్లోకి అడుగుపెట్టింది. అక్టోబరు 11నుంచి ఈ అంతర్జాతీయ సేవలను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈవో కార్నెలిస్‌ వీస్విజిక్‌ గురువారం అధికారికంగా ప్రకటించారు. అక్టోబరు 11న ఢిల్లీ, ముంబయిల నుంచి పుకెట్‌కు తొలి విమానాలను నడపనున్నారు. ఆ తర్వాత అక్టోబరు 14న ముంబయి, ఢిల్లీల నుంచి మాలికి విమానసేవలను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గురువారం వెల్లడించింది. త్వరలోనే ఇందుకు ఈ ప్రయాణాల టికెట్‌ బుకింగ్‌లను ప్రారంభించనున్నారు. రెండేళ్ల కిందట 20వ విమానంగా ఎయిర్‌బస్‌ ఏ320 నియోను అందుకున్న గోఎయిర్‌ అంతర్జాతీయ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అర్హత సంపాదించింది. 2005 నవంబరులో గోఎయిర్‌ దేశీయ కార్యకలాపాలు ప్రారంభించింది. 2016 ఆగస్టులో చైనా, వియత్నాం, మాల్దీవులు, కజకిస్థాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా సహా 9 దేశాలకు విమానాలు నడిపేందుకు అనుమతులు లభించాయి. ప్రస్తుతం సంస్థ చేతిలో 38 ఎయిర్‌బస్‌ ఏ320 విమానాలు ఉన్నాయి. వీటి ద్వారా దేశవ్యాప్తంగా 23 గమ్యస్థానాలకు 1,544 విమాన సేవలను అందిస్తోంది.
కాగా.. అంతర్జాతీయ సేవల ప్రారంభంతో ఈ ఘనత సాధించిన ఆరో దేశీయ విమానయాన సంస్థగా
గోఎయిర్‌ నిలిచింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ప్రయివేటు ఎయిర్‌లైన్లు జెట్‌ఎయిర్‌వేస్‌, ఇండిగో, స్పైస్‌జెట్‌ అంతర్జాతీయ సేవలు అందిస్తున్నాయి.