అఖిలపక్షంలో తెలంగాణపై ఏ పార్టీ వ్యతిరేకంగా చెప్పలేదు

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ

హైదరాబాద్‌, జనవరి 2 (జనంసాక్షి) :

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గతనెల 28న తెలంగాణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన ఏ ఒక్క పార్టీ కూడా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒక్క సీపీఎం మాత్రమే తాము సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ప్రకటించిందని, అయినా పార్లమెంట్‌లో బిల్లు పెట్టుకుని తెలంగాణ ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని తెలిపిందన్నారు. సమస్యను నెలరోజుల్లోగా పరిష్కరించాలని ఆ పార్టీ కోరిందన్నారు. మొదట్లో సమైక్యాంధ్ర అన్న ఎంఐఎం పార్టీ కూడా విభజనకు అంగీకరించిందని తెలిపారు. కాకపోతే ఆ పార్టీ రాయల తెలంగాణ డిమాండ్‌ తెరపైకి తీసుకొచ్చిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తరఫున హాజరైన సీమాంధ్ర ప్రాంత ప్రతినిధి గాదె వెంకట్‌రెడ్డి సమావేశంలో కనీసం నోరు కూడా విప్పలేదని తెలిపారు. సురేశ్‌రెడ్డి చెప్పిన వైఖరే షిండే నమోదు చేసుకున్నారని ప్రకటించారు. టీడీపీ 2008లో ఇచ్చిన లేఖనే మళ్లీ ఇస్తూ.. సమస్యను పరిష్కరించాల్సింది కేంద్రమే అంటూ మరో లేఖ ఇచ్చిందన్నారు. వైఎస్సార్‌ సీపీ కూడా ఇదే తరహాలో కోరిందని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే అంటూ చెప్పారని తెలిపారన్నారు. ఏ ఒక్క పార్టీ కూడా తెలంగాణ ఇవ్వొద్దని చెప్పలేదని స్పష్టం చేశారు.ేదని స్పష్టం చేశారు.