అగ్గిపుల్లలతో ఐఎస్ఐఎస్ బాంబులు

5555న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణలో ఉగ్రవాదులు సంచలన విషయాలు బయటపెడుతున్నారు. గత ఏడు నెలల నుంచి ఉగ్రవాదులు అగ్గిపుల్లల్లో, దీపావళి టపాసుల్లో ఉపయోగించే రసాయనాలు సేకరించి బాంబులు తయారు చేస్తున్నారని వెలుగు చూసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పేలుళ్లకు వీటిని ఉపయోగించాలని వాళ్లు కుట్రపన్నినట్లు వెలుగు చూసిందని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల దగ్గర స్వాధీనం చేసుకున్న బాంబుల్లో పొటాషియం క్లోరేట్, పొటాషియం నైట్రేట్ లాంటి రసాయనాలు ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు అన్నారు. పొటాషియం క్లోరేట్ ను అగ్గిపుల్లల చివర ఉండే మందులో ఉపయోగిస్తారు, పోటాషియం నైట్రేట్ దీపావళి సామాగ్రి తయారీలో విరివిగా ఉపయోగిస్తారని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. ఆన్ లైన్ నియామకాల ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)లో చేరారని ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేశారు. ఇటీవల 16 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. వారి వద్ద స్వాధీనం చేసుకున్న బాంబుల్లో పోటాషియం క్లోరేట్, పోటాషియం నైట్రేట్ ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.

గతంలో ఉగ్రవాదులు అమోనియం నైట్రేట్ ను ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే అమోనియం నైట్రేట్ అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాల మీద ఉగ్రవాదుల కన్నుపడింది. ఐఎస్ఐఎస్ మాడ్యూలుకు నాయకత్వం వహిస్తున్న ముదాబిర్ ముస్తాక్ షేక్ (ముంబై) తన అనుచరులకు అగ్గి పెట్టలు, దీపావళి టపాకాయలు భారీ మొత్తంలో సేకరించాలని సూచించాడు. తరువాత వాటి నుంచి నాటు బాంబులు ఎలా తయారు చెయ్యాలని ముస్తాక్ వారికి నేర్పించాడు. ముంబై, హైదరాబాద్ నగరాల్లో అరెస్టు అయిన ఉగ్రవాదుల నుంచి ఐడీడీలు తయారు చెయ్యడానికి ఉపయోగించే పరికరాలు, టైమర్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. నిందితులు ఆల్ -ఖైదాకు చెందిన ఇన్ స్పైర్ అనే ఆన్ లైన్ పత్రికలో నాటు బాంబులు ఎలా తయారు చెయ్యాలని అని చూసి నేర్చుకుంటున్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.