అగ్రరాజ్యంలో జాగరణ
– కౌంటింగ్‌లో మోసం జరుగుతుంది
– సుప్రీం కోర్టుకు వెళతాం:ట్రంప్
– నలుగురు భారతీయుల గెలుపు
వాషింగ్టన్,నవంబరు 4 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా విజేతను తేల్చలేకపోయాయి. ట్రంప్ గెలుస్తారా లేక బైడెన్ గెలుస్తారా ఇంకా చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం బైడెన్ లీడింగ్‌లో ఉన్నా.. కీలక రాష్ట్రాల్లో తామే విజయం సాధిస్తామని ట్రంప్ అన్నారు. దీంతో అధ్యక్ష రేసు ఆసక్తికరంగా మారింది. వీలైతే సుప్రీంకోర్టుకు వెళ్తామని ట్రంప్ ప్రకటించడం మరి కొంత టెన్షన్ పుట్టిస్తున్నది. ఈ దశలో అసలు అమెరికా ఎన్నికల ఫలితాల పరిణామాలు ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. అమెరికా ఎన్నికల్లో 538 మంది పోటీపడుతారు. వారిని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. వారే దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. 2016లో పాపులర్ ఓటింగ్‌లో ట్రంప్ వెనుకబడ్డా.. ఆయన మాత్రం 304 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో హిల్లరీకి 227 ఓట్లు వచ్చాయి. ప్రతి రాష్ట్రంలో పాపులర్ ఓటు గెలిచినవారే.. ఆ రాష్ట్ర ఎలక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 14వ తేదీన ఆ ఎన్నిక జరగనున్నది. ఆ తర్వాత ఉభయసభలు జనవరి ఆరవ తేదీన ఓట్ల లెక్కింపు కోసం భేటీ అవుతాయి. ఆ సమావేశంలో అధికారికంగా విజేతను ప్రకటిస్తారు. సాధారణంగా గవర్నర్లు ఎలక్టోరల్ విజేతను వెల్లడిస్తారు. కానీ పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కిన్‌సన్, నార్త్ కరోలిన రాష్ట్రాల్లో డెమోక్రటిక్ గవర్నర్లు ఉన్నారు. దీంతో ఆ రాష్ట్రల్లో ట్రంప్‌కు సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఏ అభ్యర్థికి కూడా ఎలక్టోరల్ మెజారిటీ దక్కకపోతే.. అప్పుడు రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కాంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. అంటే.. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు.. దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఇక సేనేట్ ప్రతినిధులు ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒకవేళ 269-269 వచ్చినా.. అప్పుడు కూడా కాంటింజెంట్ ఎలక్షన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్లు అయినా.. కోర్టు అయినా ఫలితం మాత్రం కచ్చితంగా జనవరి 20వ తేదీ లోపు తేలాలి. ఒకవేళ ఆ నాటికి కూడా విజేత ఎవరో తెలియనప్పుడు.. హౌజ్ స్పీకర్.. తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ప్రస్తుతం స్పీకర్‌గా నాన్సీ పెలోసి ఉన్నారు.
కౌంటింగ్‌లో మోసం.. సుప్రీంకు వెళ్తాం: డోనాల్డ్ ట్రంప్
అమెరికా ఎన్నికల ఫలితాల్లో మోసం జరుగుతోందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. వైట్‌హౌజ్ నుంచి ఆయన ఇవాళ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్‌లో ఫ్రాడ్ జరుగుతున్నదని, తాము సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ప్రజల పట్ల ఇది మోసం అని, మన దేశానికి ఇది అవమానకరమని అన్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలను తామే గెలిచామని, కానీ దేశంలో సమగ్రతను అమలు చేయడమే తమ లక్ష్యం అని ఆయన అన్నారు. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అసాధారణమని, రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. ఎన్నికల ఫలితాల ప్రక్రియపై కట్టుదిట్టమైన చట్టాన్ని తయారు చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. మిలియన్ల సంఖ్యలో ఉన్న పోస్టల్ ఓట్ల కౌంటింగ్‌ను వెంటనే ఆపేయాలని అధ్యక్షుడు కోరారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల ఆధారంగా బైడెన్ ముందంజలో ఉన్నారు. ట్రంప్ కూడా మ్యాజిక్ మార్క్‌కు దగ్గరగా సవిూపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ 237, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లను గెలుచుకున్నారు. కానీ ఇంకా కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితం బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దాన్ని ట్రంప్ తప్పుపట్టారు. ఇది అత్యంత విషాదకర సమయమని, ఈ ఎన్నికలను తామే గెలవబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. కీలకమైన ఫ్లోరిడాలో తామే గెలిచామని ట్రంప్ చెప్పారు. ఓహయా, టెక్సాస్ లో గెలిచామన్నారు. జార్జియాలో కూడా గెలిచామని, అక్కడ 2.25 శాతం అధిక ఓట్లను గెలిచినట్లు ఆయన చెప్పారు. ప్రత్యర్థులను మనల్ని అందుకునే అవకాశం లేదన్నారు. నార్త్ కరోలినాలోనూ 1.5 శాతం ఆధిక్యం ఉన్నట్లు తెలిపారు. ఆరిజోనాలోనూ ఫలితాలు ఆసక్తికరంగా ఉన్నాయన్నారు. ఇక అత్యంత కీలకమైన పెన్సిల్వేనియాలోనూ సంపూర్ణ ఆధిక్యంలో ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. మిచిగన్ రాష్ట్రంలోనూ భారీ మెజారిటీతో గెలవనున్నట్లు తెలిపారు. పెన్సిల్వేనియాలో కూడా భారీ మెజారిటీతో గెలవనున్నట్లు ట్రంప్ చెప్పారు.
అమెరికా ఎన్నికల్లో గెలిచిన నలుగురు భారతీయులు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల పాత్ర ఎంతో ఉంటుంది. అధ్యక్ష అభ్యర్థుల గెలుపులో భారతీయుల ఓట్లు ప్రధాన భూమిక పోషిస్తాయి. అలాగే అమెరికా ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికల్లోనూ మనవారి సత్తా చెప్పుకోదగింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో నలుగురు భారతీయులు ఘనవిజయం సాధించారు. యూఎస్ ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికైనవారిలో డాక్టర్ అవిూ బేరా, ప్రవిూలా జయపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ఉన్నారు. ఈ నలుగురూ డెమోక్రాటిక్ సభ్యులు కావడం విశేషం. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో తొలిసారిగా లెక్కించే శక్తిగా భారతీయ-అమెరికన్ సమాజం ఉద్భవించింది. ఫ్లోరిడా, జార్జియా, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్ రాష్ట్రాలలో క్లిష్టమైన ఓటింగ్ కూటమిగా అవతరించిన సుమారు 1.8 మిలియన్ల ఎన్నారై సభ్యులను ఆకర్షించడానికి డెమోక్రాట్, రిపబ్లికన్లు అనేక చర్యలు చేపట్టాయి. డెమోక్రటిక్ పార్టీ తరపున రాజా కృష్ణమూర్తి వరుసగా మూడోసారి గెలుపొందారు. ఇల్లినాయిస్ కౌంటీ నుంచి ఆయన ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. రాజా కృష్ణమూర్తి.. లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్‌ను ఓడించాడు. మొత్తం ఓట్లలో దాదాపు 71 శాతం వాటా రాజా కృష్ణమూర్తి పొందారు.44 ఏండ్ల వయసున్న రో ఖన్నా.. రిపబ్లికన్ పార్టీకి చెందిన తోటి భారతీయ-అమెరికన్ రితేష్ టాండన్‌ను 50 శాతం కంటే ఎక్కువ తేడాతో ఓడించారు. కాలిఫోర్నియాలోని 17 వ కాంగ్రెషనల్ జిల్లా నుంచి రో ఖన్నా వరుసగా మూడోసారి విజయం సాధించారు. ‘సమోసా కాకస్’ సీనియర్ మోస్ట్ సభ్యుడు డాక్టర్ అవిూ బేరా, వరుసగా ఐదోసారి కాలిఫోర్నియాలోని ఏడో కాంగ్రెషనల్ జిల్లాను సులభంగా గెలుచుకున్నారు. తన సవిూప రిపబ్లికన్ ప్రత్యర్థి 65 ఏళ్ల బజ్ ప్యాటర్సన్‌పై 25 శాతానికి పైగా పాయింట్ల తేడాతో ఆధిక్యంలో గెలుపొందారు. ప్రవీలా జయపాల్ కూడా మరోసారి వాషింగ్టన్ నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2016 లో గెలుపొందిన ఏకైక భారతీయ-అమెరికన్ మహిళగా నిలిచారు. 22 ఏళ్ల కాంగ్రెస్ జిల్లా టెక్సాస్‌కు చెందిన జీఓపీకి చెందిన ట్రాయ్ నెహ్ల్స్ కు శ్రీ ప్రెస్టన్ కులకర్ణి గట్టి పోటీ ఇస్తున్నారు. కడపటి వార్తలు వచ్చేసరికి కులకర్ణి ఐదు శాతం పాయింట్లతో వెనుకబడి ఉన్నారు. ఇలాఉండగా, రిపబ్లికన్ మంగ అనంతత్ములా వర్జీనియాలోని 11 వ కాంగ్రెషనల్ జిల్లాలో డెమోక్రాటిక్ పదవిలో ఉన్న జెర్రీ కొన్నోలి చేతిలో ఓడిపోయారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన నిషా శర్మ కూడా తన తొలి కాంగ్రెస్ ప్రయత్నాన్ని కోల్పోయింది. డెమోక్రటిక్ పార్టీకి చెందిన మార్క్ డిసాల్నియర్ ఆమెను 50 శాతానికి పైగా పాయింట్లతో ఓడించారు.