అగ్రవర్ణాల మధ్య..  సీఎం చిచ్చుపెడుతున్నారు

– అధికారం కోసమే కాపులకు 5శాతం రిజర్వేషన్లు
– నిధులు విడుదల చేస్తున్నా.. కేంద్రంపై నింధలు వేస్తున్నారు
– బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
కాకినాడ, జనవరి22(జ‌నంసాక్షి) : ఇన్నాళ్లు దళితులు, బీసీల మధ్య చిచ్చుపెడుతూ కాలంవెళ్లదీసిన ఏపీ సీఎం చంద్రబాబు, ఇప్పుడు ఎన్నికల సమయంలో అగ్రవర్ణాల మధ్య చిచ్చుపెట్టి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు విమర్శించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. వైఎస్‌ జగన్‌పై కోడికత్తితో దాడి జరిగినపుడు సింపుల్‌గా మాట్లాడిన చంద్రబాబు నేడు ఎన్‌ఐఏ విచారణ వద్దంటూ ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ప్రశ్నించారు.  దొరికిపోతాననే భయంతోనే బాబు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. ఆంధప్రదేశ్‌ అభివృద్థికి కేంద్రంలోని బీజేపీ పాటుపడుతోందని అన్నారు. సర్వశిక్ష అభియాన్‌ కింద కస్తూర్బా పాఠశాలకు కేంద్రం 600కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మోరంపూడిలో  ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి, హార్టికల్చర్‌ సబ్‌ సెంటర్లకు నిధులను కూడా కేంద్రమే ఇచ్చిందన్నారు. అగ్రవర్ణాల పేదలకు కేంద్రం 10శాతం రిజర్వేషన్లు కేటాయిస్తే.. దానిలో నుంచి కాపులకు ఏపీలో 5 శాతం రిజర్వేషన్లు ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాజకీయ వ్యవస్థలో ఉన్న సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలని హితవు పలికారు. చంద్రబాబు పరిపక్వత లేని నిర్ణయంతో సమాజంలోని రెండు వర్గాల మధ్య దూరం పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అధికారం కోసమే అగ్ర అగ్రవర్ణాల రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారని విమర్శించారు. బాబు అగ్రవర్ణాలు, కాపుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘గతంలో మాల మాదిగల మధ్య, మొన్నటికి మొన్న బీసీలు, కాపుల మధ్య గొడవ పెట్టారు. బాబు మోసాన్ని కాపులు గమనించాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని తాను ఎవరికి లేఖ రాయలేదని అన్నారు. ఇక్కడ ఉన్న శాంతి భద్రతలపై మాత్రమే ¬ం మంత్రికి లేఖ రాశానని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలపై స్వయంగా మంత్రి అయ్యన్న పాత్రుడే చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేసిన సహాయంపై మంత్రి మాటలకన్నా ఇంకేం ఆధారం కావాలని చురకలంటించారు.