అగ్రిగోల్డ్ కేసులో మణిశర్మకు బెయిల్
ఇంకా జైలులోనే ఛైర్మన్
ఏలూరు,ఆగస్ట్16(జనం సాక్షి): అగ్రిగోల్డ్ కేసులో ప్రధాన వ్యక్తులుగా ఉన్న ఛైర్మన్న అవ్వా వెంకట రామారావు ఇంకా కడప జైలులోనే ఉన్నారు. అలాగే ఇటీవలే అరెస్టయి ఏలూరు సబ్‌జైలులో ఉన్న అవ్వా సీతారామారవు కూడా బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన ఆ సంస్థ డైరెక్టర్ అవ్వా సుబ్రహ్మణ్యశర్మ అలియాస్ మణిశర్మ బుధవారం ఉదయం బెయిల్‌పై విడుదలయ్యారు. డిపాజిట్ల గడువు ముగిసినా చెల్లింపులు చేయకపోవడంతో అగ్రిగోల్డ్‌పై వివిధ ప్రాంతాల్లో 14 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటివరకూ 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఎనిమిది నెలల క్రితమే బెయిల్‌పై విడుదలయ్యారు. మణిశర్మకు 14 కేసుల్లో బెయిల్ మంజూరు కాగా, వాటన్నింటికీ షూరిటీలను సంబంధిత కోర్టులలో చూపించి ఈనెల 14వ తేదీన బెయిల్ పొందారు. బెయిల్ పత్రాలు ఏలూరు జిల్లా జైలుకు 14వ తేదీ రాత్రి ఆలస్యంగా అందడంతో బుధవారం ఉదయం జైలు అధికారులు ఆయనను విడుదల చేశారు.