అటవీ సంపద రక్షణకు కఠిన చర్యలు

కరీంనగర్‌,ఏప్రిల్‌15:  జిల్లాలో అడవుల నుంచి అక్రమంగా కలప రవాణాను అరికట్టేందుకు అటవీ  అధికారులు కఠినమైన చర్యలకు పూనుకుంటున్నారు. ఇప్పటికే అడవుల అభివృద్ధికి నర్సరీల ఏర్పాటు, భూగర్భ జలాల పెంపునకు మినీ పర్కులేషన్‌ ట్యాంకులు, సమతుల కందకాలు, బండరాళ్ల కట్టడాలు, చెక్‌డ్యాంలు, కాంటూర్‌ కందకాలతోపాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. కలపను అడ్డుకోవడమే  కాకుండా ప్రమోదవశాత్తు అడవుల్లో అంటుకున్న మంటలను నిలువరించేందుకు జిల్లాలో తొలిసారిగా సారంగాపూర్‌ మండలంలోని బీర్‌పూర్‌, కొడిమ్యాలలో వాచ్‌ టవర్‌ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం బీర్‌పూర్‌లోని ఎత్తయిన గుట్టపై నున్న అటవీప్రాంతంలో ఈ టవర్‌ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం నిర్మాణం చివరి దశలో ఉంది. నిర్మాణం పూర్తి చేసుకున్న తర్వాత ఐదుగురు బేస్‌ క్యాంపు సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు అడవులను పర్యవేక్షిస్తారు. నిర్మించిన టవర్‌పై ఉండి దాదాపు రెండు, మూడు కిలోవిూటర్ల దూరం వరకు అడవులు కనిపించేలా టవర్‌ను నిర్మించారు. నిర్మించిన టవర్‌పై నుంచి బేస్‌ క్యాంపు సభ్యులు దూరంలో ఎక్కడైనా అడవుల్లో మంటలు అంటుకుని కాలిపోతుంటే అప్రమత్తమై మంటలను ఆర్పివేయనున్నారు. అలాగే అత్యవసర పరస్థితుల్లో మంటలను ఆర్పేందుకు ఒక్కో సెక్షన్‌ పరిధిలో ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచనున్నారు. కొత్తగా ఎత్తైన గుట్టపై మరింత ఎత్తుగా ఉండే వాచ్‌ టవర్ల నిర్మాణం చేపట్టడంతో కిలోవిూటర్ల దూరం వరకు కనిపించే అడవులను కాపాడుకోవచ్చని అటవీశాఖ సరికొత్త నిర్మాణాలు చేపట్టింది. అడవుల సంరక్షణతోపాటు కలప అక్రమ రవాణాను నిలువరించేందుకుఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.  ప్రస్తుతం జిల్లాలో బీర్‌పూర్‌లో నిర్మాణం పూర్తి కావస్తుందని మున్ముందు రాయికల్‌ రేంజ్‌ పరిధిలో నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.