అడుగడుగునా అడ్డగింపు 


– హాయ్‌ల్యాండ్‌ ముట్టడికి యత్నించిన అగ్రిగోల్డ్‌ బాధితులు
– ముట్టడిని అడ్డుకున్న పోలీసులు
అమరావతి, నవంబర్‌21(జ‌నంసాక్షి) : అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో అవిూతువిూకి సిద్ధమైన బాధితులు ‘ఛలో హాయ్‌ల్యాండ్‌’ పేరుతో ముట్టడి కార్యక్రమం చేపడుతుండటంతో.. గుంటూరు అర్బన్‌ జిల్లాలో బుధవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అగ్రిగోల్డ్‌ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బాధితులు హాయ్‌ల్యాండ్‌ను ముట్టడించేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్‌ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని బాధితులు కోరారు. మరోవైపు ముట్టడిని భగ్నం చేసేందుకు పెద్ద ఎత్తున పోలీసులను ప్రయోగిస్తోంది. ముట్టడిలో పాల్గొనేందుకు వస్తున్న బాధితులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
హాయ్‌ల్యాండ్‌ సవిూపంలో అగ్రిగోల్డ్‌ కస్టమర్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగలు పట్టుకోవడం చేతకాని పోలీసులు.. తమను అరెస్ట్‌ చేస్తున్నారని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని తమను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితులు  ‘ఛలో హాయ్‌ల్యాండ్‌’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హాయ్‌ల్యాండ్‌ చుట్టూ 15 చెక్‌ పోస్టులను పోలీసులు ఏర్పాటు చేశారు. గుంటూరు అర్బన్‌ జిల్లా మొత్తం 50 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి.. ముట్టడికి వచ్చే అగ్రిగోల్డ్‌ బాధితులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాజా టోల్‌గేటు వద్ద పలువురు బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇక్కడ పోలీసులకు బాధితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మంగళగిరి వై జంక్షన్‌ వద్ద కూడా బాధితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు ప్రతిఘటిస్తుండం పరిస్థితి ఉద్రిక్తం నెలకొంది. అగ్రిగోల్డ్‌ బాధితులు తలపెట్టిన ఛలో హాయ్‌ల్యాండ్‌కు మద్దతు తెలిపేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
అగ్రిగోల్డ్‌ బాధితుల అరెస్ట్‌లు సరికాదు – సీపీఐ నేత రామకృష్ణ
అగ్రిగోల్డ్‌ బాధితుల అరెస్ట్‌లను ఖండిస్తున్నామని, అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శించారు. హాయ్‌లాండ్‌ ముట్టడికి అగ్రిగోల్డ్‌ బాధిత సంఘం నేతలు బుధవారం పిలుపు ఇచ్చారు. దీంతో పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు. దీనిపై స్పందించిన రామకృష్ణ మాట్లాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం అగ్రిగోల్డ్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం అవసరమని, కలిసి వచ్చే పార్టీలతో డిసెంబర్‌ 2న విజయవాడలో సభ నిర్వహిస్తామని అన్నారు. విభజన హావిూలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంట్‌ సమావేశాల సమయంలో ఢిల్లీలో నిరసన చేపడతామని రామకృష్ణ స్పష్టం చేశారు.