అణు భద్రతకు పెను ప్రమాదం!
వాషింగ్టన్ : అణు భద్రత కోసం భారత్ భారీ విరాళాన్ని ప్రకటించింది. అణు భద్రతా నిధి కోసం సుమారు 10 లక్షల డాలర్లు ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. వాషింగ్టన్‌లో జరిగిన అణు భద్రతా సదస్సులో మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఉగ్రవాదుల నుంచి పొంచి ఉన్న ముప్పు నుంచి తప్పించుకునేందుకు జాతీయ స్థాయిలో అణు భద్రతకు అమితమైన ప్రాముఖ్యతను ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. అణు భద్రతా సదస్సులో భారత్ చేసిన కీలకమైన నాలుగు ప్రతిపాదనలు ఇవే.
1. అణు భద్రతకు అత్యున్నత జాతీయ ప్రాధాన్యత ఇవ్వనున్నాం. బలమైన అంతర్జాతీయ సంబంధాలతో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాం. వ్యక్తిగత పర్యవేక్షణా సంస్థ ఆధీనంలో అణు కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా శిక్షణ పొందినవాళ్లు ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
2. అణు ఉగ్రవాదాన్ని అడ్డుకునేందుకు టెక్నాలజీని ఆధునీకరిస్తాం. ప్రతికూల శక్తుల్ని విచ్ఛిన్నం చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. సైబర్ టెక్నాలజీతో వైద్య వసతుల ఏర్పాటు. సీసియమ్-137 రేడియోఐసోటోపులు, శుద్ధి చేసిన యురేనియం వాడుతాం.
3. అణు అక్రమ రవాణాను భారత్ వ్యతిరేకిస్తుంది. అణ్వాయుధ, అణుధార్మిక పదార్ధాల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. అణ్వాయుధాల స్మగ్లింగ్‌ను నివారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.
4. అణు భద్రతా అంశంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ సూత్రాలకు మద్దతు ఇస్తాం. అణు భద్రతా నిధి కోసం 10 లక్షల డాలర్ల విరాళం ప్రకటిస్తున్నాం. అణ్వాయుధ కేంద్రాల పరిరక్షణ కోసం అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో భారత్‌లో ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పాటు చేస్తాం.