అత్యాచార ఘటనలు అరికట్టలేని ప్రభుత్వాలు
విజయవాడ,ఆగస్ట్4(జనం సాక్షి): మహిళలపై అత్యాచారాలు,లైంగిక దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఎపి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వి.జయలక్ష్మి విమర్శించారు. రోజురోఉకూ అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదన్నారు. బీహార్‌లో జరిగిన ఘటన జాతికే అవమానమని అన్నారు. బిజెపి ప్రభుత్వం పాలనలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు పెరిగిపోయాయని చెప్పారు.ఒంటరిగా మహిళలు బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు.బేటి బచావో,బేటిపడావో అంటూ గొప్పలు చెప్పే ప్రధాన మంత్రి మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలం చెందిందన్నారు. చెన్నై నగరంలో 11 ఏళ్ల మూగ విద్యార్థినిపై 24 మంది వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని,వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లైంగిక వేధింపులు, నేరాలు పెరుగుదలకు మధ్యంపానమే కారణమన్నారు. ప్రభుత్వాలు తమ ఖజానా నింపుకోవడం కోసం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇస్తున్నారని చెప్పారు.వెంటనే అడ్డగోలు మద్యం అమ్మకాలు అరికట్టాలని కోరారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ సాధించేంత వరకు ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.